చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ… వీళ్లంతా ఓ తరం హీరోలు. అంతా సఖ్యతగానే ఉంటారు. అయితే… చిరు, నాగ్ల బంధం మాత్రం ప్రత్యేకం. వీరిద్దరూ మంచి స్నేహితులు. చిరుని నోరానా.. `అన్నయ్య` అని పిలస్తుంటాడు నాగ్. చిరు కూడా అంతే. నాగ్ విషయంలో ఆయన ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు కురిపిస్తుంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్యా బాక్సాఫీస్ వార్ మొదలైంది. ఇద్దరి సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిరంజీవి నటించిన `గాడ్ ఫాదర్` అక్టోబరు 5న విడుదల అవుతోంది. సరిగ్గా అదే రోజు నాగార్జున `ది ఘోస్ట్` ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. దసరా సీజన్‌ని టార్గెట్ చేసిన సినిమాలు ఇవి. సంక్రాంతి, వేసవి తరవాత కీలకమైన సీజన్ ఇది. కాబట్టి ఈ సీజన్‌ని మిస్ చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు.
గాడ్ ఫాదర్ కంటే ముందే ది ఘోస్ట్ రిలీజ్ డేట్ ఖరారు అయిపోయింది. ఆ తరవాతే.. గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈరోజు ఘెస్ట్ విడుదల చేసిన కొత్త పోస్టరుపై కూడా సెప్టెంబరు 5నే విడుదల చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. అంటే.. రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పూ లేదన్నమాట. పండగ సీజన్ కాబట్టి.. ఒకే సారి రెండు సినిమాలు వచ్చినా పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే… ప్రేక్షకుల మూడ్ ఇప్పుడు మారిపోయింది. ఓ సినిమాకి వెళ్లాలంటే వంద లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన `ఆచార్య` పెద్ద ఫ్లాప్ అయింది. నాగ్ కి కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవ్వడం పెద్ద సమస్యే.