సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఓ పూటలో ముగిసిపోయింది. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ప్రో వైసీపీ మీడియా కూడా జగన్ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉదయమే ప్రధాని ఇంట్లో అరగంట సేపు ఉన్నారు. వారి మధ్య భేటీ ఎంత సేపు జరిగిందో స్పష్టత లేదు. అయితే ఎప్పట్లాగే… పోలవరం దగ్గర్నుంచి అన్నిరకాల డిమాండ్లతో ఓ నివేదికను మాత్రం ఇచ్చారు. దాన్నే మీడియాకు చెప్పారు. అ తర్వాత విద్యుత్ మంత్రిని కలిశారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిశారు.
అయితే సామాజిక న్యాయం అని పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్ రెడ్డి.. తనతో పాటు విజయసాయిరెడ్డిని.. మిథున్ రెడ్డిని తీసుకెళ్లారు. మరొకరికి చాన్సివ్వలేదు. ఈ విషయం కూడా చర్చనీయాంశమయింది. ఆ తర్వాత తిరుగుపయనయ్యారు. ఎప్పుడూ అడిగే వాటి కోసం జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో స్పష్టత లేదు. అమిత్ షాను కూడా కలుస్తారని ప్రచారం జరిగినా అపాయింట్మెంట్ మాత్రం లభించలేదని తెలుస్తోంది.
అయితే జగన్ రాష్ట్ర విషయాల కోసం కాకుండా మారుతున్న రాజకీయ పరిస్థితులను చక్క బర్చుకోవడం కోసం వెళ్లినట్లుగా తెలుస్తోంది. మోదీతో ఆయన రాజకీయ అంశాలపై చర్చించిఉంటారని అంటున్నారు. అవేమిటో తెలిసే చాన్స్ లేదు. జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పటిలా ఎవరికీ ఆసక్తి కలిగించలేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జగన్ వెళ్తారు.. వస్తారు.. చివరికి లోపల ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఒకటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు.