ఒంట్లో వైరస్ చేరిందని తెలుసు. దాని లక్ష్యం ఆరోగ్యం నాశనం చేయడం అనీ తెలుసు. కానీ వైరస్‌కు ముందు వేసుకోలేని నిస్సహాయత కాంగ్రెస్ పార్టీది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేత.. కాంగ్రెస్‌లో ఉండి.. వేల కోట్ల ఆస్తిపరులుగా మారి.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి నాటకాలాడుతున్నారని తెలిసినా చర్యలు తీసుకోలేదని దుస్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. ప్రియాంకా గాంధీతో జరిగినసమావేశానికి కోమటిరెడ్డి గైర్హాజర్ కావడమే కాదు.. రేవంత్‌పై ఆరోపణలు చేశారు.
సోనియాకు లేఖ రాశానంటూ దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఎయిర్ పోర్టుకే మీడియాను పిలిపించి మునుగోడుపై ప్రియాంకా గాంధీ మీటింగ్ కంటే ఎక్కువ హంగామా చేయడానికి ప్రయత్నించారు. అంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అయినా రేవంత్ రెడ్డి కానీ సీనియర్లు కానీ.. ఆయన సమయాభావం వల్ల రాలేకపోయారని కవర్ చేస్తున్నారు. ఓ వైపు ఆయన కాంగ్రెస్ లో ఉంటూ.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే ప్లాన్ పకడ్బందీగా చేస్తూంటే… ఆయనను ఇంకా బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూండటం ఆ పార్టీ కార్యకర్తల్లోనూ అసహనానికి కారణం అవుతోంది.
రాజగోపాల్ రెడ్డి .. అన్న మాట జవదాటడు. అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహంలో భాగంగానే జరుగుతోందని రాజకీయాలపై అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. అయినా వెంకటరెడ్డి విషయంలో హైకమాండ్ సాఫ్ట్ గానే వ్యవహరిస్తోంది. దాన్ని ఆయన అలుసుగా తీసుకుంటున్నారు. ఇదే కాంగ్రెస్ బలహీనత అనుకోవాలేమో ?