రేటింగ్స్ పడిపోతున్నాయన్న కంగారో లేకపోతే.. ముంచుకొస్తున్న ఎన్నికల కోసం సన్నాహమో తెలియదు కానీ.. టీవీ9లో సీనియర్ జర్నలిస్టులు అందర్నీ రూ. లక్షల జీతాలు ఇచ్చి తీసుకుంటున్నారు. చివరికి సంస్థను వీడి వెళ్లిపోయి ఖాళీగా ఉన్న మురళీకృష్ణను కూడా మళ్లీ తీసుకొచ్చారు. ఇప్పుడు టీవీ 9కు నలుగురు ఔట్ పుట్ ఎడిటర్లు ఉన్నారు. చాలా వరకూ చానళ్లు నలుగురు సబ్ ఎడిటర్లతో బండి లాగించేస్తూంటాయి. కానీ టీవీ9లో మాత్రం పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ప్రతీ పొజిషన్‌లోని త్రిబుల్ రోల్.. ఫోర్త్ రోల్స్ పెట్టుకున్నారు. ఎవరు ఏం పని చేస్తారో వారికే క్లారిటీ లేకపోతే మొదటికే మోసం వస్తుంది.
ఇలా తీసుకుంటున్న వారందరికీ తక్కువ జీతాలు ఆఫర్ చేయడం లేదు.. కనీసం రూ. లక్ష .. ఆపైనే జీతం ఉంటోంది. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారికి ఇంకా ఎక్కువ. ఇంత భారీ మొత్తంలో జీతాలకు ఖర్చుచేయడానికి .. అవసరం లేకపోయినా పెద్ద ఎత్తున సీనియర్లను రిక్రూట్ చేసుకోవడానికి కారణం ఏమిటన్నది వ్యాపారంలో పండిపోయిన టీవీ9 యజమానులైన రియల్ ఎస్టేట్ మాస్టర్ మైండ్‌లకే తెలియాలి.
గతంలో సాక్షి పత్రిక , చానల్ పెట్టినప్పుడు ఇతర పత్రికలు, చానళ్లలో కీలకంగా పని చేసే… ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా వార్తలు వచ్చే సంస్థల్లో కీలకంగా పని చేసే వారిని గుర్తించి.. భారీ ఆఫర్లు ఇచ్చి చేర్చుకునేవారు. ఎన్నికల సమయంలో వారు క్రియాశీలకంగా లేకపోతే చాలన్నట్లుగా .. ఉండేవారు. ఎన్నికలయ్యాక వారందర్నీ అవమానపర్చి వెళ్లిపోయేలా చేసేవారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహమే అమలు చేస్తున్నారని.. దానికి టీవీ9 వేదికగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం టీవీ9లో సీనియర్ పొజిషన్లలో చేరుతున్న వారిలో టీవీ 5, ఏబీఎన్ లాంటి ప్రో టీడీపీ చానళ్లు.. ఇతర పత్రికల నుంచి చేరేవాే ఎక్కువ ఉన్నారు. అందుకే ఆ వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.