వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీలో తాను చేయించిన తాజా సర్వే వివరాలు బయటపెట్టారు. 2024 ఎన్నికల్లో టిడిపికి ఎడ్జ్ ఉందని, జనసేన టిడిపి కలిస్తే వార్ వన్ సైడే అని, ఇంగ్లీష్ చానల్స్ లో వస్తున్న సర్వేలను చూసి అవి నిజమని నమ్మితే వైఎస్ఆర్సిపి మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలా కాలంగా తమ సొంత పార్టీ వైఎస్ఆర్సిపి కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కి టికెట్ రాదు అన్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా తాను ఒక యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి సర్వే చేయించానని ఆయన వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా ఆయన వెల్లడించారు. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు కర్నూలు నెల్లూరు అనంతపురం జిల్లాలలో టిడిపికి ఎక్కువ సీట్లు వస్తాయని, కడపలో మాత్రం వైఎస్ఆర్సిపి కి ఎక్కువ సీట్లు వస్తాయని, ప్రకాశం గుంటూరులలో టిడిపి వైఎస్ఆర్సిపి కి మధ్య పోటాపోటీ అన్నట్లు ఉంటుందని, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం అత్యధికంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఇక సీట్ల విషయానికి వస్తే, టిడిపి కచ్చితంగా గెలిచే సీట్లు ప్రస్తుతానికి 54 ఉన్నాయని, మరో 39 స్థానాల్లో టీడీపీకి ఎడ్జ్ ఉందని, ఈ రెండు కలుపుకుంటే దాదాపు 93 స్థానాల దాకా టిడిపికి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. వైసిపి కచ్చితంగా గెలిచే సీట్లు 10, వైసీపీకి ఎడ్జ్ ఉన్న సీట్లు నాలుగు ఉన్నాయని, ఈ విధంగా 14 సీట్లు వైసిపి కి వచ్చే అవకాశం కచ్చితంగా ఉందని ఆయన అన్నారు. మిగిలిన 68 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని, వీటిలో గోదావరి జిల్లాలకు చెందిన నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం అత్యధికంగా ఉంటుందని, ఒకవేళ టిడిపి జనసేన కలిస్తే కనుక ఈ 68 స్థానాలలో సింహభాగం టిడిపి జనసేన కూటమి గెలుస్తుంది అని, అప్పుడు కనీసం 127 స్థానాల దాకా ఈ కూటమికి వచ్చే అవకాశం ఉందని, ఆ విధంగా వార్ వన్ సైడ్ అవుతుందని ఆయన వెల్లడించారు.
అయితే యాప్ ద్వారా నిర్వహించే సర్వేలకు విశ్వసనీత ఎంతవరకు ఉంటుందన్నది సందేహాస్పదంగా మారింది. పైగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు వెల్లడించే సర్వే ఎంతవరకు వాస్తవం అన్నదానిపై కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో లగడపాటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చి తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన ప్రజా కూటమి గెలుస్తుందని ప్రకటించిన సంగతి, ఆ ఎన్నికల్లో ప్రజా కూటమి దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన రఘురామకృష్ణంరాజు కూడా మరో లగడపాటి లా మారుతున్నారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే రఘు రామ చెప్పిన స్థాయిలో కాకపోయినప్పటికీ అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మీద గత రెండేళ్లలో కాస్త వ్యతిరేకత పెరిగిన విషయం మాత్రం వాస్తవం అని వారు భావిస్తున్నారు.