చిరంజీవితో ఓ సినిమా చేయాలన్నది పూరి జగన్నాథ్ కల. చిరు 150వ సినిమా చేయబోతున్నప్పుడు `ఆటోజానీ` కథ చెప్పాడు పూరి. ఆ సినిమా ఆల్మోస్ట్ ఓకే అనుకొన్నారు. కానీ… పని జరగలేదు. దాంతో.. చిరు కల కలగానే మిగిలిపోయింది. అయితే ఇప్పటికీ చిరు సినిమాపై పూరి ఆశలు చావలేదు. చిరుతో సినిమా తప్పకుండా తీస్తా.. అంటున్నాడు పూరి. `ఆటోజానీ` కథ పక్కన పెట్టి, చిరు కోసం మరో కథ రాశాడట. ఆ కథ కూడా చిరుకి వినిపించానని అంటున్నాడు పూరి.
”ఆటోజానీ కథ చిరంజీవి కోసమే రాశాను. ఆయనకు ఎందుకో నచ్చలేదు. ఆయన కోసం ఇంకో కథని కూడా రెడీ చేశా. చిరుతో సినిమా చేయాలన్నది నా కల. ఆయనకు కథ నచ్చేంత వరకూ రాస్తూనే ఉంటా..” అంటున్నాడు పూరి. చిరుకి కూడా పూరి అంటే అభిమానమే. రామ్ చరణ్ డెబ్యూ మూవీ చేయాలనుకొన్నప్పుడు చిరుకి తట్టిన మొదటి పేరు.. పూరినే. ‘గాడ్ ఫాదర్’లో ఓ జర్నలిస్టు పాత్ర ఎవరితో చేయిస్తే బాగుంటుంది? అనుకుంటున్నప్పుడు పూరి అయితే బాగుంటుందని సలహా ఇచ్చింది కూడా చిరునే. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో చక చక సినిమాలు చేయాలని చిరు భావిస్తున్నారు. ఈ దశలో పూరి చెప్పిక కథకు గానీ, చిరు కనెక్ట్ అయితే ఈ కాంబోకి తెర లేచినట్టే.