తెలంగాణలో పొత్తుల రాజకీయాలపై చర్చలకు కేసీఆర్ తెర లేపారు. సీపీఐతో పొత్తు పెట్టుకున్నామని త్వరలో సీపీఎం కూడా కలసి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీజేపీపై పోరాడటానికి శక్తులన్నీ కలిసి పోరాడటానికి దేశవ్యాప్తంగా చర్చలు జరుపుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఏ పార్టీతోనూ కలవాలని అనుకోలేదు. ఎంఐఎం వంటి పార్టీలతో లోపాయికీ ఒప్పందాలకే పరిమితమైంది కానీ.. నేరుగా పొత్తు ప్రస్తావన తీసుకు రాలేదు. అన్ని పార్టీల నేతలనూ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. అందులో కమ్యూనిస్టు నేతలూ ఉన్నారు.
అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను దగ్గరకు తీసుకుంటున్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాలో ఆ పార్టీలకు మెరుగైన ఓటు బ్యాంక్ ఉండటం.. ఆయా జిల్లాల్లో టీఆర్ఎస్ వీక్‌గా ఉండటంతో వారి వల్ల మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఆయన వారితో సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల కారణంగా ముందుగానే వారి పొత్తు విషయంలో క్లారిటీ వచ్చింది. ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉంటాయా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉంది. బీజేపీ పుంజుకుంటోంది. ఈ రెండు పార్టీలకూ టీఆర్ఎస్ దూరంగానే ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీని ప్రధాన శత్రువుగా పరిగణిస్తోంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త టీఆర్ఎస్కు దగ్గర అనుకోవచ్చు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వస్తుందో చెప్పలేము. సర్వేలు అంచనా వేస్తున్నట్లుగా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు టీఆర్ఎస్ .. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా.. బీజేపీతో కలిశా అనేది కీలకం కావొచ్చు. హంగ్ ఏర్పడిన సందర్భంలో .. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కేసీఆర్‌తో కలిసేందుకు రెండు జాతీయ పార్టీలూ ఆసక్తి చూపిస్తాయి. అంటే తెలంగాణ రాజకీయ పొత్తులు రాను రాను కీలకంగా మారబోతున్నాయన్నమాట.