తెలంగాణ రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. కల్వకుంట్ల కవిత పేరును ఢిల్లీలో బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తోంది. ఉదయమే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఓ వివాదాస్పద వీడియోనూ యూట్యూబ్‌లో పెట్టారు. మునావర్ షోను తాను వద్దని చెప్పినా పెట్టారని.. రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని తాను చెప్పానని.. ఆ మేరకు రియాక్షన్ ఉందని తానుచెప్పానని రాజాసింగ్ చెబుతున్నారు. ఆ వీడియోను పోలీసులు వెంటనే యూ ట్యూబ్ నుంచి తొలగింపచేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం సాగుతున్నప్పుడే పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ను పోలీసులు చుట్టుముట్టారు. స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఉన్న ఆయన క్యాంప్ నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదు.
అయితే లిక్కర్ స్కాం విషయంలో బండి సంజయ్ ఆందోళనలు చేయాలనుకుంటున్నారని ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. బండి సంజయ్‌ను అలా అరెస్ట్ చేయడం కలకలం రేపింది. వెంటనే అమిత్ షాకూడా బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చూపించలేదు. కరీంనగర్‌లోని ఆయన ఇంటి వద్ద వదిలి పెట్టారు. దీంతో పాదయాత్రను ఆపడానికే ఇలా చేశారని.. తనకు కేంద్ర భద్రత కావాలని ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
ఆయనకు కేంద్ర బలగాల భద్రత కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారో స్పష్టత లేదు కానీ… ఈ అంశాన్ని బీజేపీ నేతలు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో నిండా కూరుకుపోయి.. డైవర్షన్ కోసమే ఇలా చేస్తున్నారని ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ బండి సంజయ్‌ను ఇలాగే అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కరీంనగర్ ఎస్పీ, సీపీలకు లోక్ సభ స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ వ్యవహారం రెండు పార్టీ మధ్య దుమారానికి కారణం అవుతోంది. పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి రావడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.