లేపాక్షి స్కాంపై వైసీపీ కిక్కురుమనడం లేదు. ఏదో ఓ కథ రాసుకొచ్చి వినిపించే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకో కానీ మీడియా ముందుకు రాలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. వెంటనే.. సజ్జల మీడియా ముందుకు వస్తారు. ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా.. ఆయన అడ్రస్ లేరు. ప్రభుత్వ వర్గాలు కూడా దీనిపై నోరెత్తడం లేదు. అయితే కౌంటర్ ఇవ్వకపోతే నిజమనుకునే ప్రమాదం ఉందని.. వైసీపీ వర్గాలు కూడా అనుకుంటాయి. ఎలా చూసినా కేటాయింపులు రద్దు చేసిన లేపాక్షి భూముల్ని ప్రభుత్వం కాపాడుకోకపోవడం.. సైలెంట్గాఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
అటు బ్యాంకులకు..ఇటు ప్రభుత్వానికి ఒక్క సారే వేల కోట్ల టెండర్ పెట్టాలనుకుంటున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో జగన్మోహన్ రెడ్డి సన్నిహిత కంపెనీల పాత్ర..బంధువుల జోక్యం .. తేటతెల్లమయింది. అయితే ఇక్కడ బ్యాంకుల తీరే అనుమానాస్పదంగా ఉంది. ఇందుకు రుణాలిచ్చిన బ్యాంకుల యాజమాన్యాలు కూడా ఈ లేపాక్షిస్కాం వెలుగులోకి రావడంతో కిక్కురుమనడం లేదు. ఐదు వేల కోట్లు అప్పు ఇచ్చి.. ఐదు వందల కోట్లకు సెటిల్ చేసుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియడం లేదు.
ఏదో ఒకటి ఎదురు దాడి చేయడానికైనా వైసీపీ నేతలు ముందుకు రావాల్సింది. రాలేదు. దీనిపై తెర వెనుక అన్నీ చక్కబెట్టిన తర్వాత వస్తారేమో తెలియదు.. ఈ స్కాం విషయం ముందు ముందు సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై సరైన ఆధారాలతో కోర్టుకు వెళ్లినా.. పాలకులు ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అలాగే ఈ విషయంలో భూములు ఇతర కంపెనీలకు వెళ్తున్నా.. చూస్తూ ఊరుకుంటున్న అధికారులు కూడా ఇబ్బందిపడటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.