టీఆర్ఎస్ వ్యూహకర్తలు ఏం చేస్తున్నారో వారికైనా అర్థమవుతుందో లేదోకానీ.. వారి నిర్ణయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఈ నెల ఇరవై ఏడో తేదీన ముగియనున్న బండి సంజయ్ పాదయాత్రను మూడురోజుల ముందుగా నిలిపివేశారు పోలీసులు. అనుమతుల్లేవని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కారణాలు చెబుతున్నారు. ప్రారంభించి చాలా కాలం అయింది. ముగింపు దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతుల్లేవని పోలీసులకు తెలిసిందా..? రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఇప్పుడే వినిపించిందా ?
బండి సంజయ్‌ను మంగళవారం ఉదయమే ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. అది అరెస్ట్ కూడా కాదు. పాదయాత్ర నుంచి తీసుకొచ్చి కరీంనగర్లో ఇంటిదగ్గర విడిచిపెట్టారు. తర్వాత పాదయాత్ర నిలిపివేయమని నోటీసులుఇచ్చారు. పాదయాత్ర చేస్తే రాని కవరేజీ.. ప్రజల్లో చర్చ .. నిలిపివేయడం వల్ల వచ్చింది. రోజంతా బండి సంజయ్ ఇష్యూనే నడిచింది. పోలీస్ కమిషనర్ నోటీసులు ఇవ్వడం.. తాము పాదయాత్ర చేసి తీరుతామని చెప్పడం.. గవర్నర్‌కు కలవడం.. చివరికి కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఇదంతా బీజేపీకి మైలేజ్ కోసం .. టీఆర్ఎస్ పన్నినప్లాన్ లా ఉంది కానీ..బీజేపీని ఎందుకు అడ్డుకోవాలన్న అంశంపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయంగా ఉద్రిక్త పరిస్థిులు ఏర్పడ్డాయి. .ఈ క్రమంలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన అంశం ఢిల్లీ స్థాయికి చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. చిన్న విషయాన్ని టీఆర్ఎస్ .. లేనిపోని కారణాలతో రచ్చ చేసుకోవండ ఏమిటని ఆ పార్టీ కార్యకర్తలు కూడా మథనపడుతున్నారు. ఇలా చేయడం వల్ల కవిత ఇష్యూలో టీఆర్ఎస్ భయపడుతోందన్న అభిప్రాయాన్ని కల్పించేలా చేశారంటున్నారు.