వైసీపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఆ పార్టీ వర్గాలు మీడియాకు ఓ జాబితా విడుదల చేశాయి. అనధికారికంగా అయినా.. ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉందని.. ఆయా చోట్ల అభ్యర్థులు, ఇంచార్జులను మార్చేస్తున్నామని చెబుతున్నారు. ఇలా చెబుతున్న నియోజకవర్గాలు దాదాపుగా 60 ఉన్నాయి. పన్నెండు ఎంపీ సీట్లలో కూడా అభ్యర్థులను మారుస్తామని చెబుతున్నాయి. సర్వేల్లో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా కొత్త సమన్వయకర్తల్ని నియమించబోతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉండనున్నాయి. మరి కొన్ని నియోజకవర్గాల్లో అదనపు ఇన్చార్జులను నియమించడం, మార్పులు చేయడంపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.
సీఎం వైఎస్ జగన్ మొత్తం 175 నియోజకవర్గాల్లో అనేక సర్వేలు చేయించారు. ఐ ప్యాక్ టీంతోపాటు ఢిల్లీకి చెందిన మరో సంస్థతోనూ ఈ సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. ధర్డ్ పార్టీ టీములతోనూ సర్వేలు చేయించారు. వాళ్లు ఇచ్చిన నివేదికలను బట్టి మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే 12 మంది ఎంపీలను కూడా మార్చే అవకాశముంది. కొందర్ని ఎమ్మెల్యేలుగా పోటీకి దింపడం.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం అదనపు ఇన్చార్జులను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది.
వైఎస్ఆర్సీపీలో ఏదైనా జగన్ నిర్ణయమే ఫైనల్. సర్వేల ప్రకారం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో మంత్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో మంత్రులకు కష్టకాలమేనన్న ప్రచారంజరుగుతోంది. కనీసం అరడజన్ మంది మంత్రులకు టిక్కెట్లు ఉండకపోవచ్చని.. గట్టిగా పట్టుబడితే వారిలో కొంత మందిని ఎంపీలుగా పంపించే చాన్స్ ఉందని భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది నేతలకు టిక్కెట్లు లభించవన్న సంకేతాలు ఇప్పటి నుండే వెళ్తున్నాయి.