గౌతమ్ అదానీ అన్ని వ్యాపార సంస్థలను ఎలా కొంటున్నారు ? ఈ విషయం చాలా మందికి డౌటే. ఎందుకంటే మార్కెట్లో తాను కొనాలనుకున్న వాటిని కొనేస్త్తున్నారు. అవి పోర్టులైనా.. ఎయిర్ పోర్టులైనా.. చివరికి టీవీ చానళ్లుఅయినా సరే. తాను కొంటున్న వాటిని కష్టపడి కట్టిన.. నిర్మించిన సంస్థలపై ఐటీ, సీబీఐ, ఈడీ కేసులు ఉంటాయి.. లేకపోతే అప్పటికప్పుడు వస్తాయి.అది ఆయనకు బాగా కలసి వస్తోంది. వీటిని పక్కన పెడితే వాటిని అప్పనంగా కొనేయలేరు.. దానికి తగ్గ విలువలో కనీసం సగానికైనా కొనాల్సిఉంటుంది. అలాగే కొంటున్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న అసలు విలువకే్ కొనేశారు. మార్కెట్ రేటు అంత కంటే ఎక్కువ ఉంటుందని నిపుణులు అంచనా వేసినా పట్టించుకోలేదు.
ముంబైలోని జీవీకే ఎయిర్ పోర్టు.. ఇతర ఆస్తులూ అలాగే కొనుగోలు చేశారు. ఇక పోర్టుల గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలా కొనాలన్నా వాటికి డబ్బులు కట్టాల్సిందే. ఎలాగోలా డిస్కౌంట్‌కు కొనే అవకాశాలు లభిస్తున్నా.. మిగతా వాటిని కొనాలంటే నగదు కావాలి. అందు కోసం బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు. ఆయనకు ఎంత ఉంది.. ఎలా చెల్లిస్తారు అనే ఆలోచన లేకుండా బ్యాంకులు అడిగినంత అప్పులు ఇస్తున్నాయి. ఇప్పటికి ఆయనకు రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉందని తాజాగా లెక్కలు బయటకు వచ్చాయి.
ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరు కావొచ్చు. కానీ ఆయన కుబేరత్వం షేర్ల విలువ మీద ఆధారపడి ఉంటుంది. నిన్నటికి నిన్న ఆయన అప్పుల గురించి బయటకు రాగానే చాలా కంపెనీల షేర్లు నాలుగైదు శాతం పడిపోయాయి. ఆ మేరకు తగ్గిపోయింది. నిజానికి కంపెనీలు.. అవి సాధించే లాభాలే అసలైనవి. వాటి షేర్ల విలువ కాదు. ఒకప్పుడు స్నాప్ డీల్ వేల కోట్లు చేసేది.. ఇప్పుడు వందల కోట్లకు కూడా ఎవరూ కొనేందుకు సిద్ధంగా లేదు. అదానీ కంపెనీ ఇంకా షేర్ల మీద ఎదిగినవే. అందుకే షేర్లు పడిపోతే.. ఆయన కంపెనీల విలువ తగ్గిపోతుంది. ఓ నివేదిక ప్రకారం.. అదానీ ఆస్తుల కన్నా అప్పులు ఎన్నో రెట్లు ఎక్కువ.
అదానీ ఇప్పటికిప్పుడు దేశం విడిచి వెళ్లిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని.. అలా బ్యాంకులు అప్పులు ఇచ్చాయని సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు చెబుతూ ఉంటారు. ఇలా ఎలా … అదానీ అప్పులు తీసుకున్నారు… సంస్థలు కొన్నారన్న సంగతిని పక్కన పెడితే.. ఆయన మునిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చేంతగా ఆయన మారారు. అలా మార్చింది ఎవరో ఎవరికి వారు గుర్తించాలి.