తిరుమలలో ఏపీ మంత్రులు చెలరేగిపోతున్నారు. దేవుడి దగ్గరకు వెళ్తున్నామన్న కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. లక్షల మంది భక్తుల్ని అసౌకర్యానికి గురి చేస్తూ..తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు అనుచరులతో కొండ మీద దిగిపోతున్నారు. తక్షణం దర్శనం కల్పించకపోతే సంగతి చూస్తామన్నట్లుగా మాట్లాడి ఆలయంలోకి వెళ్లిపోతున్నారు. వీరి తీరు చూసి సామాన్యభక్తులు మండిపడుతున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.
వారానికో సారి వీఐపీ దర్శనం చేసుకునే రోజా .. ఎప్పుడూ లేని విధంగా అనుచరుల్ని తీసుకొచ్చి హల్ చల్ చేశారు. దాదాపుగా రెండు గంటల పాటు ఆలయాన్ని కంట్రోల్లో ఉంచుకున్నారు. ఎప్పుడూ లేనిది ఆమె ఇలా ఎందుకు తెచ్చారంటే అంతకు ముందు ఇతర మంత్రులు అలాగే చేశారు. మంత్రి ఉషాశ్రీ చరణ్ సామాన్యభక్తులు కొండపై లక్షకుపైగా ఉండగానే … తన అనుచరులతో ఆలయంలోకి వెళ్లిపోయారు. సామాన్యభక్తులకు నలభై ఎనిమిది గంటలకు దర్శనం అవుతూంటే ఆమెకు ఆమె అనుచరులకు క్షణాల్లో దర్శనం అయిపోయింది.
అంతకు కొద్ది రోజుల ముందే గుమ్మనూరు జయరాం.. వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు తదితరులు ఇదే విధంగా పెద్ద సంఖ్యలో అనుచరులను దర్శనానికి తీసుకొచ్చారు. ఒకేసారి 60 నుంచి 80 మందిని తమతోపాటు ఆలయంలోకి తీసుకెళ్లే వరకు ఊరుకోలేదు. మంత్రి అప్పలరాజు అయితే ఏకంగా 150 మందితో వచ్చి ఆలయం దగ్గర చేసిన యాగి అంతా ఇంతా కాదు. దేవుడి దగ్గర కూడా అధికారం ఏమిటి.. అన్న ఆలోచన వారికి రావడం లేదు. దర్పం చూపిస్తున్నారు. సామాన్య భక్తులను తంటాలు పెడుతున్నారు. తిరుమలలో ఏ ఒక్క వ్యవస్థా సరిగ్గా పని చేయడం లేదన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు.