రాజకీయ ఆరోపణలు చేయకుండా కోర్టుకెళ్లి స్టేలు కూడా తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరూపించారు. తనపై ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ ఒకరు.. మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆరోపణలు చేస్తున్నారని.. వాటికి మీడియాలో విస్తృత ప్రచారం లభిస్తోందని అందుకే ఆరోపణలు చేయకుండా నిలువరించాలని.. సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. ఢిల్లీ ఎంపీకి.. మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే రాజకీయ ఆరోపణలు చేయకుండా.. కోర్టు ఆదేశాలు పని చేస్తాయా లేదా అన్నది నిపుణులు కూడా చెప్పలేరు. గతంలో వైట్ చాలెంజ్ పేరుతో రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇలాగే సిటీ సివిల్ కోర్టుకు వెళ్లారు. అప్పుడుకూడా కోర్టు కేటీఆర్‌కు వ్యతిరేకంగా డ్రగ్స్ కేసులో ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు కవిత కూడా అదే తరహాలో ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
అయితే కవిపై చేసే ఆరోపణలు ఆగుతాయా అన్నది చెప్పడం కష్టమని రాజకీయవర్గాలంటున్నాయి. బీజేపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా అసలు విషయం బయట పెట్టాల్సింది మాత్రం సీబీఐ. ఈ అంశంలో సీబీఐ ప్రకటన చేసే వరకూ.. ఈడీ విషయాలు వెలుగులోకి తెచ్చే వరకూ కవితపై ఎన్ని ఆరోపణలు చేసినా అది రాజకీయమే. అయితే సీబీఐ ఒక వేళ కవిత పాత్రను ధృవీకరిస్తే.. అప్పుడు కూడా రాజకీయమే కానీ.. ఆధారాలున్న ఆరోపణలతో చేస్తున్న రాజకీయం అవుతుంది. ఇప్పటికైతే.. కవిత కోర్టు నుంచి ఊరట పొందారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇవి తెలంగాణ నేతలకూ వర్తిస్తాయి.