తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న ప్రియాంకా గాంధీ కోమటిరెడ్డిని పిలిపించి మాట్లాడారు. చెప్పాల్సినది చెప్పారు. ఆయన చెప్పినదీ విన్నారు. కలిసి పని చేసుకోవాలని.. మునుగోడును గెలిపిచాలని చెప్పి పంపించారు. అంటే కోమటిరెడ్డికి ఇప్పుడు ఒక్కటే చాయిస్ మిగిలింది.. అయితే మునుగోడులో ప్రచారం చేయడం లేదా బీజేపీలో చేరిపోవడం.
సుదీర్ఘ కాలంగా నల్లగొండ రాజకీయాల్లో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేకమైన పట్టు ఉంది. కోమటిరెడ్డి బలం అంతా.. బీజేపీ వైపు వెళ్తే కాంగ్రెస్కు దెబ్బే. వెంకటరెడ్డి మునుగోడుతో తనకేం సంబంధం అంటున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి పని చేసే ప్రశ్నే లేదంటున్నారు. సోదరుడు పోటీ చేయకపోతే.. మునుగోడు బాధ్యతను తీసుకుని హైకమాంండ్ వద్ద కోమటిరెడ్డి పలుకుబడి పెంచుకునేవారే. కానీ ఇప్పుడు ఆయన సోదురుడు పోటీ చేస్తున్నారు.
మునుగోడు బాధ్యత ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్లో కీలకంగా మారింది. స్థానిక బలం కోమటిరెడ్డికి కలసి వస్తోంది. సోదరుడిని ఇప్పటి వరకూ విమర్శించని ఆయనకు బాధ్యతలిస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని బీజేపీ కోసం పని చేసేలా చేస్తారని కొంత మంది వాదిస్తున్నారు. అదే ఆయనకు మైనస్ అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన వ్యవహారం కాంగ్రెస్కు నష్టం చేసేలా ఉంది కానీ.. మేలు చేసేలా లేదని చెబుతున్నారు.
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పరిమామాలకు కారణం అవుతోంది. ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా ఆ పార్టీలో ఓ రకమైన అలజడి ఖాయంగా కనిపిస్తోంది. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు. కాంగ్రెస్ రాత మార్చడానికి బయట నుంచి వచ్చిన నేతలు ప్రయత్నిస్తున్నా.. సీనియర్లుగా చెప్పుకునేవారే వెనక్కి లాగుతున్నారు.