జయాపజయాలతో సంబంధం లేకుండా, వరుసగా ఛాన్సులు అందుకోవడం అంత ఈజీ కాదు. అదో ఆర్టు. ఈ విషయంలో రమేష్ వర్మని అభినందించాల్సిందే. రాక్షసుడు తరవాత తాను చేసిన `ఖిలాడీ` ప్లాప్ అయ్యింది. అయినా ఆయన చేతిలో అవకాశాలకు కొదవ లేదు. ఈమధ్యే రవితేజ సోదరుడి కుమారుడితో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఆ సినిమాకి కథ అందించిన రమేష్ వర్మ, చిత్ర సమర్పకుడిగానూ వ్యవహరించడం విశేషం. రమేష్ వర్మ పుట్టిన రోజున `రాక్షసుడు 2` ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో సుదీప్ హీరోగా నటిస్తారని టాక్.
ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ కూడా ప్రకటించేశాడు రమేష్ వర్మ. ఈ చిత్రానికి `హూ` అనే టైటిల్ ఖరారు చేశారు. ఓ హైవేపై కారు దూసుకు వెళ్తున్నట్టున్న మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో హీరో ఎవరు అనేది రివీల్ చేయలేదు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇదో పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ సినిమాలో కనిపించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. `ఖిలాడీ` ఫలితం నిరాశ పరిచినా ఆ ప్రభావం తన కెరీర్‌పై పడకుండా చూసుకున్నాడంటే.. రమేష్ వర్మ గ్రేటే.