చంద్రబాబుకు ముప్పు ఉందని ఆయనకు రక్షణ కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భావిస్తోంది. ఏపీలో ఆయన భద్రతకు సంబంధించి అనేక సందేహాలు వెల్లువెత్తూండటంతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి… ఇంట్లోకి కొంత మంది వైసీపీ నేతలు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడం వంటివి జరగడంతో ఎన్ఎస్జీ అప్రమత్తమయింది. అదే సమయంలో కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి కూడా కీలకమైన సమాచారం రావడంతో … ఎన్ఎస్జీ సెక్యూరిటీనీ రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రత్యేక బృందం ఏపీలోని టీడీపీ కార్యాలయంలో.. అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పరిశీలన జరిపారు.
భద్రతాపరమైన సమీక్ష చేశారు. త్వరలో చంద్రబాబుకు మరింత భద్రత పెంచే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున లభిస్తున్న భద్రత పేలవంగా ఉంటోంది. నిజానికి పర్యటనల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విభాగమే భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలి. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు వేరేగా ఉంటాయి. అయితే అలాంటి ప్రోటోకాల్‌ను పోలీసులు పట్టించుకోవడం లేదు సరి కదా.. వైఎస్ఆర్సీపీ నేతలు.. కార్యకర్తలు చంద్రబాబుపైకి దూసుకు వస్తున్నా చలనం లేకుండా ఉంటున్నారు.
బోరుగడ్డ అనిల్ లాంటి వైసీపీ నేతలు … చంద్రబాబుకు హాని తలపెడతామని నేరుగానే హెచ్చరించారు. ఏపీలో రాజకీయంలో వ్యక్తిగత శత్రుత్వ స్థాయి పెరిగిపోవడం.. మనుషుల్ని నిర్మూలించేందుకు కూడా వెనుకాడని పరిస్థితి ఉన్నాయన్న అభిప్రాయాలు ఏర్పడుతున్న సమయంలో ఎన్ఎస్జీ అప్రమత్తమవడం చర్చనీయాంశమవుతోంది. దేశంలో నలభై మందికి మాత్రమే ఎన్ఎస్జీ సెక్యూరిటీ లభిస్తోంది. అందులో చంద్రబాబు ఒకరు.