పాతబస్తీలో అలజడికి కారణం అయిన రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపేశారు. ఈ యాక్ట్ అమలు చేస్తే కోర్టులో హాజరు పరచాల్సిన అవసరం ఉండదు. మూడు నెలల నుంచి ఏడాది వరకూ ఆయనను జైల్లో ఉంచవచ్చు. రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది.
ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి ఆయనపై 101 కేసులు నమోదయ్యాయి. 18 మత కల్లోలాల కేసులు ఉన్నాయి. పైగా రౌడీషీట్ కూడా ఉంది. ఈ కారణంగానే ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించామని కమిషనర్ సీవీఆనంద్ ప్రకటించారు.
రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపైనే పీడీయాక్ట్ నమోదు చేస్తూంటారు. కానీ రాజకీయ నేతలపై మాత్రం ఎప్పుడూ అమలు చేయలేదు. అయితే రాజాసింగ్‌పై మాత్రం అమలు చేశారు. ఆయనను బీజేపీ కూడా సస్పెండ్ చేసింది. బీజేపీ కూడా ఆయనకు మద్దతిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రాజాసింగ్ వ్యవహారంతో పాతబస్తీ ఇప్పటికీ మండుతూనే ఉంది. ఆయనను అక్కడ కనిపించకుండా చేయడంతో ఉద్రిక్తత తగ్గుతుందని భావిస్తున్నారు.