వచ్చే ఎన్నికల్లో ఎవరు ఓట్లేస్తారు.. ఎవరు గెలుస్తారన్న దానిపై వైసీపీలో క్లారిటీ ఉంది. ఓట్లు వేసేది.. వేయించేది.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. వాలంటీర్లేనని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. వీరిపై వైసీపీని గెలిపించే బాధ్యత ఉందని పలు చోట్ల చెబుతున్నారు. సీఎం జగన్ వీరిపై నమ్మకం పెట్టుకున్నారని వాళ్లే పని పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పలు చోట్ల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఓట్లేస్తారన్న అభిప్రాయం కాకుండా వీరిపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు.
వైసీపీ నేతలు తమ పాలనపై.. సీఎం జగన్‌పై నమ్మకం పెట్టుకోకుండా ఇలా వాలంటీర్లు… వార్డు ఉద్యోగులను నమ్మడం .. పార్టీ క్యాడర్ ను కూడా లైట్ తీసుకోవడం.. రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. వాళ్లకు ఎన్నికల విధులు ఉండవు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేసినా వారిని ఎన్నికల విధులకు వాడుతారన్న గ్యారంటీ లేదు. మరి వారు ఎలా గెలిపిస్తారని వైసీపీ నేతలు అనుకుంటున్నారో స్పష్టత లేదు.
అయితే ప్రతి యాభై మంది ఓటర్ల లిస్ట్ .. వాలంటీర్ దగ్గర ఉందని.. వారే ఓట్లను బెదిరించి ఓట్లేసేందుకు తీసుకు వస్తారన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. ఇతర పార్టీల వారిని ఓటింగ్‌కు రాకుండా చేయడంలో కూడా వారే కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. వీరికి అదనంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ఉంటారని నమ్ముతున్నారు. అందుకే వారు ఈ వ్యవస్థలపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ రియాలిటీలో .. జనం వీరి తీరుతోనే విసిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కాకుండా గెలిపిస్తారని వేరేవారిపై ఆశలు పెట్టుకుంటే.. నిరాశే ఎదురవుతుంది.