జనసేన పార్టీపై వైసీపీ విపరీతమైన విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ విమర్శల సారాంశం ఇతర పార్టీల నుంచి డబ్బు తీసుకున్నారని. కానీ వాస్తవంగా పవన్ కల్యాణ్ తన సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. రాజకీయాల్లో ఫోర్స్‌గా మారలేదన్న కారణంతో బడా కార్పొరేట్లు కూడా విరాళాలు ఇవ్వడం లేదు. దీంతో జనసేన పార్టీకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి ఉన్న బలం బలగం మొత్తం జనసైనికులే. అందుకే జనసైనికుల సాయంతోనే పార్టీ ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కాలని భావిస్తున్నారు.
జనసేనకు విరాళాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు నాగబాబు. “నా సేన కోసం నా వంతు” అంటూ జనసేన విరాళాల సేకరణ ప్రారంభించారు. నిజానికి ఎప్పట్నుంచో జనసేనకు విరాళాలివ్వాలనుకునేవారి ఓ విండో అందుబాటులో ఉంది. దాని ద్వారా నెలవారీ సాయం చేస్తున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీ పరమైన ఖర్చులు పెరిగిపోతాయని.. వాటిని తట్టుకోవాలంటే విరాళాల సేకరణలో జోరు పెంచాలని నిర్ణయించుకున్నారు.
జనసేన పార్టీకి గతంలో విరాళాలు బాగా వచ్చేవి. గత ఎన్నికలకు ముందు.. జనసేన పార్టీ కి కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా సహకారం అందించాయి. ఆ ఎన్నికల్లో జనసేన ఆరు శాతం ఓట్లు సాధించింది. పవన్ కల్యాణ్ కూడా ఓడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. విరాళాలు తగ్గిపోయాయి. దాంతో పవన్ కల్యాణ్ పార్టీ నడపడం కోసం అయినా సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైతు భరోసా యాత్రకు సొంత డబ్బులే పవన్ ఇస్తున్నారు. కొంత మంది పార్టీ నేతలు విరాళం ఇచ్చినా అది చాలా స్వల్పమే. ఇప్పుడు జనసైనికులు ఎంత మేర అండగా నిలిస్తే.. జనసేనకు అంత ఆర్థిక పరిపుష్టి ఉంటుంది.