చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ రిటైర్ అవుతున్నారు. శుక్రవారమే ఆఖరి పని దినం. ఆయన చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ రకమైన ఉత్సాహవాతారణం కనిపించింది. ఆ స్థాయికి ఎదిగిన తెలుగు జస్టిస్‌గా పేరు పొందారు. ఆయన తనదైన ముద్ర వేస్తారని అందరూ అనుకున్నారు. చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం సుదీర్ఘం. చాలా మందికి అంతసుదీర్ఘంగా ఉండే అవకాశం లభించదు. కొత్తగా సీజేఐ అవుతున్న యూయూలలిత్‌కు ఆ అవకాశం మూడు నెలలు మాత్రమే ఉంది. జస్టిస్ రమణకు దాదాపుగా ఏడాదిన్నర అలా ఉండే అవకాశం లభించింది.
మరి ఏడాదిన్నరలో సీజేఐ చరిత్రలో నిలిచిపోయే తీర్పులు ఇచ్చారా ? ఈ అంశంపై జాతీయ మీడియాలోనూ చర్చ జరిగింది. అనేక మంది నిపుణులు తమదైన అభిప్రాయాలు చెప్పారు. ఎన్వీ రమణ .. న్యాయమూర్తుల నియామకాల్లో విప్లవాన్నేతెచ్చారు. అందులో డౌటే లేదు. న్యాయమూర్తుల కొరత వల్ల కేసులు పోగుపడిపోతున్నాయని గుర్తించి…కేంద్రంతో పోరాడి అయినా.. న్యాయమూర్తుల్ని నియమించాలని పట్టుదలగా ప్రయత్నించారు. 250 మందికిపైగా హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమించారు. సుప్రీంకోర్టుకు ఫుల్ బెంచ్ ఉండేలా చూశారు. న్యాయపాలనలో ఎన్వీ రమణ తనదైన ముద్ర వేశారు.
అయితే తీర్పుల పరంగా చూస్తే.. జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన తీర్పులు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకునేది లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో పని చేసిన చీఫ్ జస్టిస్‌లో అయోధ్య లాంటి సమస్యల మీద బెంచ్ మార్క్ తీర్పులు ఇచ్చారు. కానీ జస్టిస్ ఎన్వీరమణ విషయంలో మాత్రం అలాంటి తీర్పులు కనిపించలేదని న్యాయవర్గాల అభిప్రాయం. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఏడాదిలో తేల్చాలన్న కేసులో హడావుడి జరిగింది కానీ.. ఏమీ తేల్చలేదు. అదొక్కటే కాదు.. తనకు ముందుకు వచ్చిన అనేక కేసుల్లో జస్టిస్ ఎన్వీరమణ గొప్ప గొప్ప మాటలు చెప్పారు కానీ పరిష్కారం చూపలేకపోయారు. చివరికి రిటైరయ్యే ముందు చారిత్రాత్మక తీర్పు ఇస్తానన్నట్లుగా .. ఉచిత పథకాల అంశంలో మాట్లాడారు కానీ.. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని తేల్చేశారు. చర్చ కోసమే త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి ఎదిగిన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగువారికి గర్వరకారణమే. అందులో సందేహం లేదు. కానీ ఆయన పదవీ కాలంలో బెంచ్ మార్క్ తీర్పంటూ ఒక్కటి లేకపోవడం కాస్త లోటే. కానీ ఆయన ముద్ర మాత్రం..న్యాయమూర్తుల నియామకంలో స్పష్టంగా ఉంటుంది. ఎప్పటికీ నిలిచి ఉంటుంది.