రాజకీయ పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్న షర్మిల మునుగోడులో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు వచ్చిన ఉపఎన్నికల్లో పోటీకి షర్మిల ఆసక్తి చూపించలేదు. హుజూరాబాద్‌లో నిరుద్యోగులతో నామినేషన్లు వేయించేందుకు ప్రయత్నించారు కానీ సక్సెస్ కాలేదు. ఇలా ప్రతి ఎన్నికను ఎవాయిడ్ చేసుకుంటూ పోతే ప్రజలు మర్చిపోతారన్న ఉద్దేశంతో మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే అభ్యర్థి విషయంలో ఓ క్లారిటీ వచ్చిందని.. మునుగోడులో పోటీచేసే విషయాన్ని షర్మిల అధికారికంగా ప్రకటించి.. ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారని అంటున్నారు. మునుగోడులో పోటీ అంటే.. షర్మిల పార్టీ పెట్టిన తర్వాత పాల్గొంటున్న తొలి ఎన్నిక అనుకోవచ్చు. అక్కడ వచ్చే ఫలితం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. మునుగోడులో రెడ్డి సామాజికవర్గం వారికే అన్ని పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయి. దీంతో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని షర్మిల భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని అంతర్గత సర్వేలు చేయించినట్లుగా తెలుస్తోంది.
మునుగోడులో షర్మిల పార్టీ బలం ఎంత అన్నది ఎవరికీ తెలియదు. ఆ నియోజకవర్గ పరిధిలో ఆమె పాదయాత్ర చేశారు. ఆ సమయంలో జన స్పందన బాగుందని నమ్ముతున్నారు. అందుకే పోటీపై ముందుకే వెళ్తున్నారు. సామాజికవర్గాల పరంగా చూస్తే.. మునుగోడులో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు తక్కువ. పైగా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ. ఈ పరిస్థితుల్లో షర్మిల .. మునుగోడులో పోటీ చేస్తే రిస్క్ తీసుకోవడమే అవుతుందని ఎక్కువ మంది నమ్మకం. కనీస ఓట్లు తెచ్చుకోలేకపోతే.. ఆమె పార్టీని ఇక ఎవరూ పట్టించుకోరు.