తెలంగాణ బీజేపీకి అన్నీ అలా కలసి వస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెపై లిక్కర్ స్కాం ఆరోపణలు రాగానే తెలంగాణలో రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది. బీజేపీ నేతల అరెస్టులు.. వారి కార్యక్రమాలు నిలిపివేయడం వంటివి జోరుగా సాగాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. న్యాయపోరాటం చేసి .. తాము చేయాలనుకున్నది చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ ను హన్మకొండలో నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించాలనుకున్న సభకు ముందుగా పోలీసులు అనుమతి ఇచ్చారు.
అయితే ఇటీవల స్టేషన్ ఘన్పూర్ వద్ద ఉన్న పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్లో ఇంటి వద్ద దింపారు. ఆ తర్వాత పాదయాత్ర నిలిపివేయాలని ఆదేశించారు. అయితే హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. కానీ బహిరంగసభకు ఇచ్చిన అనుమతిని పోలీసులు ర్దదు చేశారు. దీంతో బీజేపీ నేతలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. బీజేపీని నియంత్రించాలనుకున్న టీఆర్ఎస్ హైకమాండ్ కు హైకోర్టు నిర్ణయాలు రుచించడం లేదు. శాంతిభద్రతల సమస్య వస్తుందని వాదించినా హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని వారు అంతర్గతంగా ఫీలైపోతున్నారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30 – సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పోలీసు ఆంక్షలు ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు అమల్లోఉంటాయని సీపీ స్పష్టం చేశారు. మరి సభ విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.