దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను జగన్ దాదాపుగా మర్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో గుర్తింపు కరవైంది. అక్కడ ఉన్న రెడ్డి సామాజికవర్గ నేత… బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన నిర్వహించిన సభకు హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యేను పిలువలేదు. అంతేనా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు దక్కడం లేదు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేనా కాదా అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్క సారిగా ఎమ్మెల్యే బరస్ట్ అయ్యారు.
శివప్రసాద్ రెడ్డి పోటీ చేయడానికి భయపడితే..తనను బతిమాలితే దర్శి నుంచి పోటీ చేశానని మద్దిశెట్టి వేణుగోపాల్ అంటున్నారు. అయితే మూడేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్నారని. తనను ఘోరంగా అవమానిస్తున్నారని ఆయన అంటున్నారు. ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటి తనకు తెలియకుండా కొందరు నాయకులు కార్యకర్తలతో మీటింగ్ లు పెడుతున్నారని.. ఇప్పటి వరకు ఎన్ని చేసిన అడ్డంకులు సృష్టించినా సహిస్తునే వచ్చాను, ఇక నుండి సహించనని ప్రకటించారు.
తాను ఎవరి సీటు లాక్కోలేదు..వారు పిలిచి పోటీ చేయమంటేనే చేశాను.ఈ రోజు నుంచి దేనికైనా ఊరుకునేది లేదు..దేనికైనా సిద్థం… ఎంత దూరమైనా వెళ్తానని ప్రకటించారు. దర్శి నుంచి బూచేపల్లి కుటుంబం వైఎస్ కుటుంబం వెంట ఉంటోంది. వైఎస్ హయాంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత శిద్దా రాఘవరావు చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో పోటీకి ఆయన అంగీకరించలేదు. దాంతో పీఆర్పీ తరపున పోటీ చేసి తర్వాత సైలెంట్‌గా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ను పిలిచి టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలిచిన తర్వాత బూచేపల్లి యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వం రావడంతో అయనే పెత్తనం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఆయనకే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో వేణుగోపాల్ రగిలిపోతున్నారు. కానీ ఆయన టిక్కెట్‌ను జగన్ ఇప్పటికే చించేశారని.. ఊరకనేఆయన ఆవేశ పడుతున్నారని దర్శిలోని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.