కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి అన్ని రకాల పదువులు అనుభవించి దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ నేతగా కొనసాగిన ఆజాద్ రాజీనామా చేశారు. ఏదైనా ఓ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు కడుపులో ఉన్నదంతా రాజకీయ నేతలు బయట పెట్టుకుంటారు. ఆజాద్ కూడా అలాగే అన్నీ చెప్పారు. ఆయన బీజేపీలో చేరుతారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన తాను బీజేపీలో చేరడం లేదంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో సొంత పార్టీ పెడతానంటున్నారు. కానీ ఆయన వయసు 75 వరకూ ఉంది. ఆయన కశ్మీర్లోకూడా ప్రజా నేత ఏం కాదు. ఆయన సొంత పార్టీ పెట్టుకునే ధైర్యం చేస్తారని ఎవర అనుకోవడం లేదు.
సొంత పార్టీ అయినా.. లేకపోతే మరో వ్యూహం అయినా బీజేపీతో ముందస్తు అవగాహన ప్రకారమే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆయనను తెలంగాణ గవర్నర్‌గా పంపిస్తారన్న ప్రచారం కూడా ఢిల్లీలో జోరుగా సాగుతోంది . గవర్నర్‌గా పంపాలంటే.. ఆయన బీజేపీలో చేరాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో చేరకుండానే గవర్నర్ కావొచ్చు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమెను పూర్తిస్థాయిలో పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అపాయింట్ చేసి.. గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని అంటున్నారు.
రెండు రోజుల కిందట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఇదివరకే తమిళిసై సౌందరరాజన్ భేటీ కూడా అయ్యారు. ఆజాద్‌కు.. తెలంగాణతో అనుబంధం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కొన్నాళ్లు … తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్ గా కూడా పని చేశారు. అంతే కాదు.. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానల్లో ఆయనకు కొంత మేర వాటా కూడా ఉంది. గతంలో ఆయన హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండేవారు. అందుకే తెలంగాణ గవర్నర్ పదవికే ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది.