కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకుని.. టీవీ 9 చానల్‌ను రవిప్రకాష్‌ను వెళ్లగొట్టడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు . నోవాటెల్ హోటల్లోనే ఈ భేటీ జరగనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మైహోం దశ తిరిగింది. పెద్ద ఎత్తుల స్థలాలు లభించాయి. వెంచర్లు వేశారు. అయితే కేసీఆర్‌తో.. ఇటీవల దూరం పెరిగింది. దానికి కారణం చినజీయర్ స్వామి ఆశ్రమంలో కేసీఆర్‌కు జరిగిన అవమానం.
ఎంత సహకరించినా.. మోదీ పాల్గొనే కార్యక్రమంలో శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేకుండా చేశారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిన కారణంగా కేసీఆర్ వారితో సంబంధాలు తెంపేసుకున్నారు. అప్పట్నుంచి మాటల్లేవని చెబుతున్నారు. అయితే ఇలా చిన్న విషయంతోనే వారి మధ్య సంబంధాలు తెగిపోనంత బలంగా ఇతర సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉంటారు. కానీ రామేశ్వరరావు ఇప్పుడు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు.
ఆయన పలుమార్లు రహస్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం ఉంది. ఈ సారి నేరుగా కలవబోతున్నారు. జేపీ నడ్డాతో నోవాటెల్‌లో ఈ భేటీ జరగనుంది. సహజంగానే ఈ అంశం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తమపై బీజేపీ కుట్రలు చేస్తుందని తెలిసి కూడా ఆ పార్టీ పెద్దలను రామేశ్వరరావు కలవడం.. కేసీఆర్‌తో పూడ్చుకోలేని ఆగాధాన్ని ఏర్పర్చుతుందని భావిస్తున్నారు.