దక్షిణాదిలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన నటుల జాబితాలో విక్రమ్‌కి స్థానం ఉంటుంది. ఈతరం హీరోల్లో విక్రమ్ చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు. విక్రమ్ వేసినన్ని గెటప్పులూ ఎవరూ వేయలేదు. అపరిచితుడు తనని స్టార్‌గా మార్చేసింది. అయితే.. ఆ తరవాత హిట్టు కొట్టడానికి ఆపసోపాలు పడుతూ వచ్చాడు విక్రమ్. గత పదేళ్లలో విక్రమ్ నుంచి ఒక్క సాలీడ్ హిట్ కూడా పడలేదు. కథ కంటే గెటప్పుల్నే ఎక్కువ నమ్ముకోవడం, ప్రయోగాలలో `అతి`… ఇవన్నీ విక్రమ్ కెరీర్‌తో ఆడుకొన్నాయి. ప్రతి సినిమాలోనూ కనీసం రెండు మూడు గెటప్పుల్లో కనిపించడం సాధారణమైపోయింది. గెటప్పులపై పెట్టిన శ్రద్ధ కథపై పెట్డడం లేదన్న విమర్శను ప్రతీసారీ ఎదుర్కొంటూనే వచ్చాడు విక్రమ్. ఇప్పుడు తన నుంచి మరో సినిమా వస్తోంది. అదే.. `కోబ్రా`. ఇందులోనూ గెటప్పుల గోలే. ఈసారి ఏడెనిమిది వేషాల్లో దర్శనమిస్తున్నాడు విక్రమ్. ట్రైలర్ కట్ చేస్తే… ఆ ట్రైలర్ అంతా.. విక్రమ్ వేసిన గెటప్పుల్ని చూపించడానికే సరిపోయింది.
ఆయా పాత్రల కోసం విక్రమ్ చాలా కష్టపడతాడు. ఒక్కో గెటప్ కోసం మేకప్ కే గంటల సమయం వెచ్చిస్తాడు. పాత్రకు తగినట్టు తనని తాను మార్చుకొంటాడు. శరీరాన్ని కష్టపెడతాడు. ఈ విషయాల్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ.. `అపరిచితుడు` తరవాత.. తనకు హిట్ ఏది? ఈలోగా ఎన్ని సినిమాల్లో, ఎన్ని గెటప్పులు వేసుంటాడు? అవన్నీ విక్రమ్‌కి కాపాడలేకపోయాయి. ఎవరైనా గెటప్ వేస్తే వెరైటీ. కానీ విక్రమ్ కి మాత్రం అది పరమ రొటీన్ వ్యవహారం. తనపై వస్తున్న విమర్శల్ని విక్రమ్ ఈసారీ పక్కన పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. `కోబ్రా` కోసం చాలా కష్టపడ్డాడు విక్రమ్. కాకపోతే… ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా, రాదా? అనేది పెద్ద డౌట్. ఈనెల 31న ఈ సినిమా వస్తోంది. ఇది ఓరకంగా విక్రమ్ కి డూ – ఆర్ డై సెట్యువేషన్. ఈసారి కూడా విక్రమ్ కి మొండిచేయి ఎదురైతే.. ఇంకెప్పుడూ గెటప్పుల జోలికి పోడేమో…? హిట్టయితే గనుక.. ఇక ప్రతీసారీ ఈ విశ్వరూపం తప్పదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.