కవితను బిగ్ డిబేట్‌కు ఆహ్వానించిన వేమూరి రాధాకృష్ణ.. ఆమె పై వచ్చిన ఆరోపణలను కవర్ చేస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. నిజానికి కవితనే చాలెంజ్ చేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌కు వచ్చినట్లుగా డిబేట్ జరిగింది. లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో కేసీఆర్ మందలించారని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దీనిపై ఆమె ఎక్కువగా ఫీలయినట్లుగా ఉన్నారు. డిబేట్ కు వచ్చిన తర్వాత ఆర్కేతో వాదనకే చాలా సమయం కేటాయించారు. అన్నింటికి ఓపికగానే ఆర్కే సమాధానాలిచ్చారు.
అయితే లిక్కర్ స్కాంకు సంబంధించి ఆర్కే వేసిన అనేక ప్రశ్నలకు కవిత వద్ద సరైన సమాధానం లేదు. కేసీఆర్‌ను టార్గెట్ చేసే తనపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారని కవిత అంటున్నారు. కానీ ఆ లిక్కర్ స్కాంతో అసలెలాంటి సంబంధం లేదని ఆమె ఘంటాపథంగా చెప్పలేకపోయారు. ఆరోపణలు చేయవద్దని.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడంలోనే ఏదో మతలబు ఉందన్న అభిప్రాయాన్ని ఆర్కే తన ఇంటర్యూ ద్వారా పంపేశారు. దీన్ని కవర్ చేసుకోవడం కవిత వల్ల కాలేదు. ఆర్కేపై ఎదురుదాడి చేశానని కవిత అనుకున్నారు కానీ.. అసలు ఏదో విషయాన్ని బయటకు రాకుండా చూసుకున్నారన్న అభిప్రాయం మాత్రం బలపడేలా చేసుకున్నారు.
ఎక్కడో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ మాత్రం సంబంధం లేకుండా కవితను ఇరికిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అయితే బీజేపీ నేతల ఆరోపణల వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉంది. దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న సమాచారం బీజేపీ నేతలకు చేరింది. లేకపోతే బీజేపీ నేతలే దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి ఉంటారు. ఏం జరిగినా.. ఈ విషయంలో కవితకు లింక్ ఉందనే అనుమానాలు గట్టిగా ఉన్న తరుణంలో.. తనపై ఆరోపణలన్నీ తప్పని ప్రజల్లోకి గట్టిగా సందేశం పంపగలిగే డిబేట్ అవకాశం లభించిన కవి.,. ఆర్కేపై ఎదురుదాడికి దిగి కోల్పోయారు.
కొసమెరుపేమిటంటే.. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా కేసీఆర్, కేటీఆర్ కవితకు మద్దతుగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదనే ఓ ప్రశ్న సంధించి.. కవితలోనూ ఓ ఆందోళన ఆర్కే రేకెత్తించారు. వారు స్పందించాల్సినంత పెద్ద ఇష్యూ కాదని ఆమె కవర్ చేసుకున్నా… మనసులో ఈ ప్రశ్న చాలా ప్రశ్నలకు కారణమయ్యే చాన్స్ ఉంది. కవితతో ఆర్కే డిబేట్ సాదాసీదా ఇంటర్యూలా లేదు.. చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.