లైగర్ ఫ్లాప్ అయ్యింది. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు, ఆశ్చర్యాలూ అవసరం లేదు. అయితే… విచిత్రం ఏమిటంటే, లైగర్ ఫ్లాప్ కేవలం విజయ్ దేవరకొండ కొండ ఆటిడ్యడ్ వల్లే – ఫ్లాప్ అయినట్టు కొందరు కావాలని మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తోంది. లైగర్ ఫ్లాప్‌ని కేవలం విజయ్ దేవరకొండ పైనే తోసేయడం చూస్తుంటే – ఇప్పుడు అసలైన ఆశ్చర్యం, అనుమానం కలుగుతోంది.
లైగర్ విషయంలో విజయ్ దేవరకొండ తప్పు ఏమైనా చేశాడా అంటే.. అది కేవలం ఈ కథని ఒప్పుకోవడం, పూరిని నమ్మడమే. `ఇస్మార్ట్ శంకర్` తరవాత పూరిని ఎవరైనా నమ్ముతారు. మళ్లీ తాను ఫామ్ లోకి వస్తే ఎన్ని అద్భుతాలు సృష్టించగలడో అందరికీ తెలుసు. అలాంటప్పుడు విజయ్ మాత్రం ఎందుకు పూరిని నమ్మకుండా ఉంటాడు? కాకపోతే ఈ కథని ఓకే చేయడం మాత్రమే విజయ్ చేసిన తప్పు. అయితే లైగర్ పాత్రకు ఏం కావాలో అన్నీ చేసేశాడు. బాడీని ఫిట్ గా ఉంచుకొన్నాడు. తన శక్తి మొత్తం ధారబోశాడు. గట్టిగా, తన స్థాయిలో ప్రమోషన్లు చేశాడు. ఒంట్లో బాగోకపోయినా ఈసినిమా ప్రచారాన్ని తన నెత్తిమీద వేసుకొని దేశమంతా తిరిగాడు. ఇవన్నీ వదిలేసి.. కేవలం విజయ్ ఆటిట్యూడ్ వల్లే ఈ సినిమా పోయిందని చెప్పడం నిజంగా దారుణం.
లైగర్‌లో కథ లేదు.
లైగర్‌లో పూరి కనిపించలేదు.
లైగర్‌లో సరైన ఎమోషన్ లేదు..
ఇలా లైగర్ లో వంద మైనస్సులు ఉన్నాయి. అవన్నీ వదిలేసి వేళ్లన్నీ విజయ్ వైపు చూపిస్తున్నాయి.
ప్రెస్ మీట్లో విజయ్ చాలా కేర్ లెస్ గా మాట్లాడాడని, టేబుల్ పై కాళ్లు పెట్టాడని చాలా విమర్శించారు. అసలు ఆ ఎపిసోడ్ ఎందుకు జరిగిందో చెబుతూ పాత్రికేయులే స్వయంగా వీడియోలు విడుదల చేశారు. ఈ విషయంలో విజయ్‌ని అనడానికి ఏం లేదు. `నా సినిమా హిట్టవుతుందంతే.. థియేటర్లు పగిలిపోతాయి.. ఇండియా షేక్ అయిపోతుంది` అని విజయ్ చెప్పిన మాట ముమ్మాటికీ వాస్తవం. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అందరి మాట. నిజానికి తన సినిమా గురించి ఏ హీరో అయినా ఇలానే చెప్పుకుంటాడు.. చెప్పుకోవాలి కూడా. ఇందులో విజయ్ కొత్తగా చేసిన తప్పేం లేదు. పైగా విజయ్ తన ప్రతీ సినిమాకీ ఇలానే ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడతాడు. ఇదే విషయం ప్రెస్ మీట్లోనూ చెప్పాడు. “నేను నా ప్రతి సినిమాకీ ఇలానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడతాను. ఈ విషయంలో మీడియా కూడా చివాట్లు పెట్టింది“ అని ఒప్పుకొన్నాడు. అలాంటప్పుడు ఈ విషయంలో విజయ్‌ని నిందంచకూడదు.
పెళ్లి చూపులు నుంచీ విజయ్ ఆటిట్యూడ్ ఇలానే ఉంది. లైగర్కి ముందు విజయ్ కొత్తగా మారిందేం లేదు. నిజానికి ఈ ప్రవర్తన వల్లే.. విజయ్ తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకొన్నాడు. ఈ ముక్కుసూటి తనం, ఈ దూకుడు నచ్చే విజయ్‌కు అభిమానులు తయారయ్యారు. ఇప్పుడు ఆ ఆటిట్యూడ్‌ని వదులుకోమంటే ఎలా..? అప్పుడు మిగిలిన హీరోలకూ, విజయ్‌కీ తేడా ఏముంటుంది? లైగర్ ఫ్లాపుపలో విజయ్ ఓ భాగం మాత్రమే. తన వల్లే ఈసినిమా ఫ్లాప్ అయ్యిందనుకోవడం అమాయకత్వం. విజయ్ ఆటిట్యూడ్ ని జనం ఒప్పుకోలేకపోతే.. విజయ్ ప్రమోషన్లకు వెళ్లిన ప్రతీసారీ ఆ స్థాయిలో ఫ్యాన్స్ పోగయ్యేవారు కాదు. లైగర్ ఓపెనింగ్ డే కలక్షన్లు చూడండి.. ఓ స్టార్ హీరో సినిమాకి వచ్చినన్ని వచ్చాయి. సినిమా బాలేదు కాబట్టి.. అమాతంగా డ్రాప్ అయిపోయాయి. విజయ్ తీరుతెన్నులు నచ్చకపోతే.. తొలిరోజు అన్ని వసూళ్లు ఎందుకొచ్చినట్టు..? బాగుంటే ఇదే ఆటిట్యూడ్ వల్ల విజయ్ సక్సెస్ అయ్యాడని అనుకొనేవారు. సినిమా పోయింది కాబట్టే విజయ్ దొరికిపోయాడు. అంతే తేడా.