విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇప్పుడు అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఉద్యోగులు మాత్రం ఉద్యమానికి ఐదు వందల రోజులు.. వెయ్యి రోజులు అయిందని గుర్తుచేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదు. కానీ సీబీఐ మాజీ జేడీ విశాఖ నుంచిగత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన వీవీ లక్ష్మినారాయణ మాత్రం న్యాయపోరాటం చేస్తున్నారు. అప్పట్లోనే హైకోర్టులో కేసు వేసిన ఆయన రెగ్యూలర్‌గా ఆ కేసును ఫాలో అప్ చేసుకుంటున్నారు. సొంతంగా లాయర్‌ను మాట్లాడుకుని వాదనలు వినిపిస్తున్నారు. ఈ అంశంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది.
గతంలో విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేంద్రం పాటించకుండా,రాజ్యాంగ బద్ధమో చెప్పకుండా కేంద్రం ముందుకు వెళుతోందని లక్ష్మినారాయణ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 9200 మంది రైతులు భూములు కోల్పోయి,నాలుగవ తరం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే…ఉద్యోగ భద్రత కల్పించకుండా కేంద్రం విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్ప,్టం చేశారు. విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాలు పరిశీలించకుండా ప్రయివేటీకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం ముందుకు వెళ్లకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు పిటిషనర్.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించి తుది విచారణ సెప్టెంబర్ 21కు వాయిదా వేసింది. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి గతంలోనే హైకోర్టు నిరాకరించింది. కేంద్రం మాత్రం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని.. ప్రకటిస్తోంది. ఎప్పట్లోపు అవుతుందో చెప్పడం లేదు కానీ.. గోప్యంగా అన్ని పనులు పూర్తి చేస్తోంది. ఇతర రాజకీయ పార్టీలన్నీ మానసికంగా సిద్ధమయ్యాయి కానీ.. జేడీ మాత్రం న్యాయపోరాటం చేసి ప్రైవేటీకరణ ఆపాలని ప్రయత్నిస్తున్నారు.