ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ గిలిగింతలు పెడుతోంది. యాక్టివ్గా ఉండే కొంత మందిని పిలిపించి… పార్టీ కార్యాలయంలో మంచి విందు ఇచ్చింది. సమావేశం అని పేరు పెట్టినప్పటికీ.. ఒకరిద్దరు ప్రసంగాలు తప్ప.. ఏమీ చెప్పలేదు. మన స్టైల్లో మనం ప్రచారం చేయడమే ముఖ్యమన్న సందేహం మాత్రం అందరికీ వెళ్లింది. వారి స్టైల్ ఏంటో.. వారికి బాగా క్లారిటీ ఉంటుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ తరహాలో కొన్ని జిల్లాల పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించారు. అవి వైసీపీవి అన్న అనుమానం రాకుండా డిజైన్ చేశారు.
కానీ అన్నీ వారివేనని.. ఆ అకౌంట్ల నుంచి భారీగా పోస్టులు.. ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు జిల్లాల వారీగా పదవులు కూడా పంపిణీ చేశారు. ఒక కన్వీనర్తో పాటు ఐదారుగులు కో కన్వీనర్లను నియమించారు. వారికి కార్యకర్తలు అదనంగా ఉంటారు. వారిని వీరే ఎంగేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీకి పని చేసిన వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. చాలా మంది .. తాము ఈ పార్టీ కోసమా.. ఈ పాలన కోసమా పని చేసింది అని సైలెంట్ అవ్వగా మరికొంత మంది ప్రాధాన్యం దక్కలేదని ఊరుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకూ వస్తూండటంతో.. వారందర్నీ మళ్లీ ఎంగేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
పాత వాళ్లెవరూ రాకపోవడంతో.. సోషల్ మీడియా వారియర్స్ కావలెను అని ప్రకటనలు ఇచ్చిమరీ రిక్రూట్ చేసుకున్నారు. వారి కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టబోతున్నారు. అయితే ఇదంతా ప్రశాంత్ కిషోర్ టీం నేతృత్వంలో జరగనుంది. మంచి ప్రయోజనాలు ఉంటాయని కొత్త వారికి వైసీపీ హైకమాండ్ భరోసా ఇస్తోంది. కానీ వారి పాత అనుభవాలు వారికి అంత నమ్మకం కలగనీయడం లేదు. ఏమైనా తేడాలొస్తే తమను జైళ్లకు పంపించి కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోరన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపించింది.