తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ఆలోచనలు డైనమిక్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత కేసీఆర్ రైతు ఎజెండాతో జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. తన పార్టీ నేతలుగా కేవలం రైతు నేతలనే పరిచయం చేయనున్నారు. అందుకే తన పార్టీ పేరును కూడా భారత రైతు సమితిగా ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ భారత రాష్ట్ర సమితి… బీఆర్ఎస్ ను ప్రారంభిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆయన రైతు సమితికే మొగ్గు చూపుతున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని రైతు ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. బుధవారమే ఆయన బీహార్ కూడా వెళ్తున్నారు. అక్కడ చర్చలు జరిపి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కేసీఆర్ ఇతర పార్టీలను కలుపుకోవడం కన్నా.. సొంతంగా జాతీయ పార్టీ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతులందర్నీ ఏకం చేస్తే కేంద్రాన్ని ఎదిరించవచ్చని కేసీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
రైతుల్ని ఏకం చేయడానికి కేసీఆర్ ఏం చేస్తారో కానీ.. తెలంగాణ నుంచి ఆయనకు గట్టి సవాళ్లే ఉన్నాయి. పార్లమెంట్ కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ గెలిస్తేనే.. ప్రయోజనం ఉంటుంది. ఓడిపోతే రాజకీయంగా అస్థిత్వ సమస్య ఏర్పడుతుంది.