బీజేపీకి దగ్గరైన కాంట్రాక్టర్లను బెదిరించి …. కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో తప్పనిసరిగా అరెస్ట్ చేసిన జగన్ బంధువు కొండారెడ్డి వ్యవహారం ఇప్పుడు .. ప్రభుత్వం ఇంతే అనుకునేలా చేస్తోంది. ఆయనను అరెస్ట్ చేసిన రెండు రోజులకే వదిలేసి .. ఆ తర్వాత జిల్లా బహిష్కరణ చేసేందుకు ప్రతిపాదనలు పంపాం అని ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పించారు. ఆ తర్వాత కొండా రెడ్డి కనిపించలేదు.మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. అదేంటి జిల్లా బహిష్కరణ ఎత్తేశారా అని పోలీసుల్ని అడిగితే.. అసలు ఎప్పుడు బహిష్కరించాం అనే ఆన్సర్ వస్తోంది.
ఆయన అలా కడప జిల్లాలోకి అడుగు పెట్టగానే… బెదిరింపులకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డి చిన్నాన్నను కొండారెడ్డి బండబూతులు తిట్టడం ఓ వ్యక్తి రికార్డు చేసి చేర్చాల్సిన వాళ్లకి చేర్చాడు. అది కొండారెడ్డికి చేరింది . అందుకే ఆయన ఫోన్ చేసి.. నిన్ను చంపుతాను.. ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను.. రికార్డుచేసి ఎవరికి పంపుకుంటావో పంపుకో అని హెచ్చరించారు. ఈ ఆడియో ఇప్పుడు కడప జిల్లాలో వైరల్ అవుతోంది.
పోలీసులు చిన్న సోషల్ మీడియా పోస్టులకే అర్థరాత్రుళ్లు అరెస్ట్ చేస్తారు. కానీ ఇలాంటి నొటోరియస్ క్రిమినల్ వ్యవహారాలు అయితే.. వైసీపీ వాళ్లయినా సరే లైట్ తీసుకుంటారు. సీఎం బంధువులు అయితే పర్మిషన్లు.. లైసెన్స్లు ఉన్నట్లే. కొండా రెడ్డి వ్యవహారంలో అది నిజం అవుతోంది.