Cobra movie review telugu
రేటింగ్: 2.25/5
కొన్ని సినిమాల వల్ల మామూలు హీరో సూపర్ స్టార్ అయిపోతాడు.
కొన్ని సినిమాల వల్ల సూపర్ స్టార్లు కూడా మామూలు హీరోల రేంజికి పడిపోతారు.
అయితే ఇంకొన్ని సినిమాలుంటాయి. ఆ సినిమాలే… ఎత్తులో నిలబడతాయి. ఆ సినిమాలే అధఃపాతాళంలోకి పడేస్తాయి. అలా విక్రమ్ జీవితాన్ని ఎత్తులో తీసుకెళ్లి, అక్కడ నుంచి కిందకు తోసేసిన సినిమా .. అపరిచితుడు. ఆ సినిమాతో విక్రమ్ రేంజ్ మారిపోయింది. తను సూపర్ స్టార్ అయిపోయాడు. అది అపరిచితుడు వల్ల కలిగిన లాభం అయితే, ఆ సినినిమా తరవాత.. ఏం చేయాలో పాలుపోకపోవడం, మళ్లీ మళ్లీ గెటప్పులనే నమ్ముకోవడం `అపరిచితుడు` వల్ల ఎదురైన అవరోధం.
అవును.. అపరిచితుడు విక్రమ్ కెరీర్ తో ఇప్పటికీ ఆడుకుంటూనే ఉంది. అపరిచితుడు కేవలం గెటప్పుల కోసమే ఆడిందన్న భ్రమలో విక్రమ్ ఊగిసలాడుతున్నాడు. అందుకే.. ప్రతీ సినిమాలోనూ రెండు మూడు గెటప్పులైనా మార్చకపోతే, విక్రమ్ కి నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు `కోబ్రా`లో.. ఏకంగా ఏడు గెటప్పులేశాడు. మరి ఈసారైనా అపరిచితుడు మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..? లేదంటే మరోసారి మేకప్పులో కాలేశాడా..?
కథగా చెప్పుకొంటే చాలా సింపుల్. కోబ్రా (విక్రమ్) రకరకాల రూపాల్లో వెళ్లి, హత్యలు చేస్తుంటాడు. కోబ్రా చేతుల్లో చనిపోయినవాళ్లంతా పేరూ, పలుకుబడి ఉన్నవాళ్లే. దాంతో ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్) బరిలోకి దిగుతాడు. కోబ్రాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ కోబ్రానే… మది (విక్రమ్) పేరుతో చెన్నైలో బతుకుతుంటాడు. తను ఓ మాథ్స్ జీనియస్. అంకెలతో ఆడుకోవడం తనకిష్టం. మరి ఆ మది… కోబ్రాలా మారి ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతన్ని అస్లాన్ పట్టుకొన్నాడా, లేదా? అనేది మిగిలిన కథ.
హీరో గెటప్పులు వేసుకొని మర్డర్లు చేయడం, తద్వారా డబ్బులు సంపాదించడం, అదంతా పేద ప్రజల కోసం వాడడం.. ఇదంతా చాలా చాలా సినిమాల్లో చూశాం. విక్రమ్ కూడా ఇలాంటి కథలు ఇది వరకు చేశాడు. ఆ సినిమాలకూ, కోబ్రాకీ ఉన్న వ్యత్యాసం ఏమిటంటే.. ఇందులో హీరో మాథ్స్ లో జీనియస్. లెక్కల సూత్రాల్ని ఉపయోగించి తెలివిగా హత్యలు చేస్తుంటాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్ని చూస్తంటే ఓ సుకుమార్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యమంత్రిని చంపే సీన్ లో బుల్లెట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి ఓ థియరీ చెబుతాడు దర్శకుడు. అది నిజంగానే అర్థం కాని ఫజిల్ లా ఉంటుంది. మాథ్స్ లో జీనియస్‌ల సంగతేమో గానీ, లెక్కల్లో అత్తెసరు మార్కులు తెచ్చుకొన్న వాళ్లంతా తలాడించడం, `ఓహో..అలా జరిగిందా..` అని అర్థం అయినట్టు నటించడం తప్ప.. ఏం చేయలేని పరిస్థితి. చర్చ్‌లో కెమికల్ ఉపయోగించి చంపడం వెనుక కూడా అర్థం కాని సైన్స్ సూత్రాలున్నాయి. అయితే వాటిని డిజైన్ చేయడం బాగుంది. ఈ సినిమాలో విక్రమ్ చాలా గెటప్పుల్లో కనిపిస్తాడని ముందు నుంచీ చిత్రబృందం చెబుతూనే ఉంది. కానీ సినిమా మొదలైన అరగంటకే గెటప్పులన్నీ అయిపోతాయి. ఆ తరవాత.. అసలు కథ మొదలవుతుంది.
ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ కనిపించాడు. లుక్ వైజ్ బాగానే ఉన్నాడు. నటనకూడా ఓకే. కాకపోతే… మరీ పాపులర్ క్రికెటర్ అవ్వడం మూలానో, ఏమో. తాను మాట్లాడుతుంటే కామెంట్రీ బాక్స్‌లో కూర్చుని కామెంట్రీ చెబుతున్నట్టే అనిపిస్తుంది. పైగా ఆ పాత్ర తన మేథస్సుని ఉపయోగించి చేసిందేమీ ఉండదు. ఇంటర్ పోల్ ఆఫీసర్ కాస్త.. కరెంట్ పోల్ లా చూస్తూ నిలబడిపోవడం తప్ప. ఈ సినిమాలో కొన్ని చిక్కుముడులు, ట్విస్టులు ఉన్నాయి. వాటిని రివీల్ చేయడం ఇన్వెస్టిగేషన్ ద్వారా జరిగితే బాగుండేది. అలా కాకుండా ప్రతీ చిక్కుముడీ తనకు తానుగా విడిపోవడమో, లేదంటే డైలాగుల రూపంలో పాత్రతో చెప్పించడమో జరిగిపోతుంటాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ మాత్రం బాగుంది. విక్రమ్ ఫ్యాన్స్ కు అది గూజ్‌బమ్ మూమెంట్ అనుకోవాలి.
ఫస్టాఫ్ లో కంప్లైంట్లు ఉన్నాయి. కాకపోతే యాక్షన్ సీన్లు, ఫారెన్ లొకేషన్లు, విక్రమ్ గెటప్పులతో… కాలక్షేపం అయిపోతుంది. ఇంట్రవెల్ ట్విస్టు బాగుండడంతో… మరీ తీసిపారేసే సినిమా కాదు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ దగ్గర తేడా కొడుతుంది. చాలా సుదీర్ఘంగా సాగే లెంగ్తీ ఫ్లాష్ బ్యాక్ అది. దాన్ని సింపుల్ గా చెప్పేస్తే బాగుండేది. 3 గంటల 5 నిమిషాల సినిమా ఇది. రెండున్నర గంటల సినిమాగా కుదించాలనుకుంటే ఫ్లాష్ బ్యాక్ ని ట్రిమ్ చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. హీరో ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? తన మోటీవ్ ఏంటి అనేది సరిగా చెప్పలేకపోయాడు. అసలు విక్రమ్ అన్ని గెటప్పులు ఎందుకు వేశాడో అర్థం కాదు. సెకండాఫ్‌లో మది ఓ ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతుంటాడు. ఆ సీన్లన్నీ.. మరింత అసహనానికి గురి చేస్తుంటాయి. దర్శకుడికి తెలివితేటలు ఉండడంలో ఏమాత్రం తప్పు కాదు. కానీ వాటన్నింటినీ ప్రేక్షకులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడమే పెద్ద పొరపాటు. అది కోబ్రాలో జరిగింది. చాలా చోట్ల ప్రేక్షకుడు అయోమయానికి గురవుతుంటాడు. ఎవరు ఎవరో తెలియని కన్ఫ్యూజన్ నెలకుంటుంది. ప్రేక్షకుడి చేతిలో ఓ అర్థం కాని ఫజిల్ ఇచ్చి సాల్వ్ చేసేలోగా.. మరో ఫజిల్ పడేస్తూ ఇలా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం జరిగింది. సినిమా అయిపోయిన తరవాత కూడా చాలా ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి. వాటికి సమాధానం కనీసం దర్శకుడికైనా తెలుసో.. లేదో?
విక్రమ్ గెటప్పులతో అలరించాడు. అంతకంటే చేయగలిగింది ఏం లేదు. నిజానికి ఈ తరహా విన్యాసాలు ఇది వరకు కూడా చేశాడు విక్రమ్. శ్రీనిధి శెట్టి లవ్ ట్రాక్ తీసేయడం వల్ల వచ్చే నష్టమేం లేదు. అలా ట్రిమ్ చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. ముఖ్యంగా రెహమాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. పాటలు పంటి కింద రాళ్లే. దర్శకుడు ఓ కొత్త నేపథ్యం (మాథ్స్, కంప్యూటర్స్)ని ఎంచుకొన్నా, ట్విస్టు బాగానే వేసుకొన్నా – ఈ కథని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయకపోవడం వల్ల.. కోబ్రా ఓ అర్థం కాని ఫజిల్ లా మిగిలిపోయింది.
ఫినిషింగ్ టచ్: కాటేసింది