తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మును నష్టపరిహారంగా పంపిణీ చేస్తున్నారు. గతంలో పంజాబ్ వెళ్లారు. ఈ సారి బీహార్ వెళ్లారు. తర్వాత మరో రాష్ట్రానికి వెళ్తారు. అయితే కంటే ఎక్కువ బాధితులు తెలంగాణలో ఉన్నారు . కానీ వారిని మాత్రం తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఎక్కడిదాకో ఎందుకు…. కేసీఆర్ బీహార్ వెళ్లడానికి ముందు రోజు ఘోరం జరిగింది. కుటుంబనియంత్రణ ఆపరేషన్ల రికార్డు కోసం చేసిన ప్రయత్నం ఫెయిలై.. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముఫ్ఫై మంది పరిస్థితి విషమంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణ సర్కార్ చాలా చిన్న విషయంగా తీసుకుంది. చివరికి విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే మంత్రి హరీష్ రావు పరామర్శకు వెళ్లారు.
తాజాగా జరిగింది కాబట్టి ఇది .. కానీ ఎన్నో అంశాల్లో తెలంగాణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తోంది. గత ముందస్తు ఎన్నికలకు ముందు కొండగట్టు వద్ద బస్సు బోల్తా పడి పెద్ద ఎత్తున జనం చనిపోయారు. వారికి కనీస సాయం కూడా ప్రభుత్వం అందించలేదు. అంత పెద్ద డిజాస్టర్నే లైట్ తీసుకుంది. బాధితుల్ని పరామర్శించలేదు. కానీ ఇతర రాష్ట్రాల వారికి మాత్రం రూ. లక్షలు చొప్పున పంపిణీ చేస్తోంది. అందుకే విపక్షాలు తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నారు. పార్టీ విస్తరణకు ప్రజల సొమ్ము వాడుతున్నారని మండిపడుతున్నారు.
గతంలో అవసరం లేకపోయినా దేశవ్యాప్తంగా ప్రతి చిన్నా చితకా పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారు. ఇందు కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు జాతీయ రాజకీయ వ్యూహాలతోనే రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా తెలంగాణ ప్రజలను నిర్లక్ష్యం చేయడమే టీఆర్ఎస్ నేతలకు సైతం ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ సమస్యల పట్ల చూసీ చూడకుండా ఉంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోందన్న ఆవేదవ వ్యక్తమవుతోంది.
కేసీఆర్ రాజకీయ పర్యటనలు చేస్తే ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాదు కానీ.. తెలంగాణ ప్రజల సొమ్మును.. ఇతర రాష్ట్రాల్లో పంపిణీ చేయడానికి వెళ్తూండటం వల్లనే సమస్య వస్తోంది.. ఇది విపక్షాల విమర్శకే కాదు.. ప్రజల్లోనూ ఓ రకమైన వ్యతిరేక అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఈ విషయాన్ని కేసీఆర్ లైట్ తీసుకుంటే ఇబ్బందికరమే.