జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం కూటమికి పూర్తి మెజార్టీ ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఊగిసలాడుతోంది. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్‌కు .. గిరిజన ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ కూడా కిందా మీదా పడుతున్నారు. సీఎం హోదాలో ఉండి సొంత గనులు కేటాయించుకున్నారని.. ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసినట్లుగా నాలుగు రోజుల కిందట ప్రచారం చేశారు. నిజానికి అధికారంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈసీ నుంచి గవర్నర్‌కు ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. కానీ గవర్నర్ ఇంత వరకూ బయటపెట్టలేదు.
అయితే హేమంత్ సోరెన్‌పై అనర్హత పడిపోయిందని.. కొత్త సీఎం ఎంచుకోవడం మేలన్నట్లుగా వ్యవహరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందని.. జేఎంఎం కూటమికి అర్థమైపోయింది. దీంతో వారు తమ ఎమ్మెల్యేల్ని సురక్షిత స్థానాలకు తరలించారు. కొద్ది రోజుల కిందట..అస్సాం నుంచి వస్తున్న ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని బెంగాల్లో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద పెద్ద ఎత్తున నగదు దొరికింది. అసోంలో బీజేపీ నేతల్ని కలిసి డీల్ మాట్లాడుకుని వారు డబ్బు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎందుకు… సోరెన్ అనర్హతపై అటూ ఇటూ చూస్తుందో రాజకీయవర్గాలకు అంతు చిక్కడంలేదు. జార్ఖండ్‌లో బీజేపీకి పాతిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో పదహారు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. ఇండిపెండెంట్లు..ఇతరులు మరో ఆరుగురి మద్దతు బయట నుంచి సాధించినా కాంగ్రెస్, జేఎంఎంల నుంచి పది మంది ఎమ్మెల్యేలను లాగాల్సి ఉంటుంది. ఆ ఆపరేషన్ పూర్తి కాకపోవడం వల్లనే ఎదురు చూస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఆ చర్చలన్నీ పూర్తయిన తర్వాత సోరెన్‌పై అనర్హతా వేటు అధికారికంగా బయటకు వస్తుందని అంటున్నారు.
ప్రభుత్వాలను కూల్చే బీజేపీ రాజకీయం మరీ హద్దులు దాటిపోయిందన్న అభిప్రాయం ఇలాంటి వాటి వల్లే పెరుగుతోంది. అయినా బీజేపీ అగ్రనాయకత్వం తమ దారిలో తాము వెళ్తోంది.