బీహార్ పర్యటనలో కేసీఆర్ ఆ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సి ఉందని గట్టిగా చెప్పారు. ఆయన చెప్పిన విధానం చూసి చాలా మందికి గతంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో టీఆర్ఎస్ అనుసరించిన విధానం గుర్తుకు వచ్చింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు..ఆ పార్టీతో సంబంధాలు బాగా లేనప్పుడు ఆయన ఏపీకి హోదా ఇస్తే మా పరిస్థితేమిటని నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో కే కేశవరావు లాంటి వారు వ్యతిరేకించారు.
ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి .. టీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారో అప్పుడు ప్రత్యేకహోదాకు తెలంగాణ మద్దతు ప్రకటించిది. రెండు రాష్ట్రాల్లో 43 మంది ఎంపీలు వైసీపీ,టీఆర్ఎస్‌కు ఉంటే హోదా తీసుకు వస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఏపీ కి ప్రత్యేకహోదా కోసం తాము కూడా పోరాడతామన్నారు. అయితే ఎన్నికల తర్వాత ఆయన సైలెంటయ్యారు. కానీ ఏపీకి హోదా కు వ్యతిరేకంగా హరీష్ రావు లాంటి నేతలు.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా అనేక సార్లు ప్రకటనలు చేశారు.
ఇప్పుడు బీహార్‌లోనూ ఇదే ఫార్ములాను కేసీఆర్ ప్రయోగిస్తున్నారు. బీహార్‌లో ప్రత్యేకహోదా అనేది చాలా కాలంగా రాజకీయ అంశం. స్వయంగా నితీష్ కుమార్ కూడా చాలా సార్లు అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీపైన విరుచుకుపడ్డారు. తర్వాత సైలెంటయ్యారు. దేశంలో ఎప్పుడు ప్రత్యేకహోదా ప్రస్తావన వచ్చినా.. బీహార్ నుంచి కూడా ” మాకూ కావాలన్న ” వాదన వినిపిస్తుంది. స్పెషల్ స్టేటస్‌ను ఏపీలోలాగానే బీహార్‌లోనూ కేసీఆర్ వాడుతున్నారన్న మాట.