తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో జరుగుతున్నదంతా ప్రచారమేనని..బీజేపీ అత్యున్నత నిర్ణయాల కమిటీల్లో సభ్యుడయిన తెలంగాణ నేత డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఆయన సభ్యుడు. ఆ బోర్డే పొత్తులను ఖరారు చేస్తుంది. ఆ బోర్డులో తెలుగు రాష్ట్రాల తరపున ఉన్న ఒకే ఒక్క నేత లక్ష్మణ్. ఆయన అభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది. ఆయన స్పందనకు ఇప్పుడు విశేష ప్రాధాన్యం లభిస్తోంది. బీజేపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని ఆయన తేల్చి చెప్పారు.
అంటే… తెలంగాణలో జనసేనతో కూడా పొత్తు ఉండదని ఆయన చెబుతున్నారు. అదే ఏపీలో అయితే జనసేనతో కలిసివెళ్తున్నామన్నారు. టీడీపీతో పొత్తుపై జరుగుతోందంతా ప్రచరమేనని చెబుతున్నారు. అయితే పార్టీలో ఎలాంటి చర్చలు జరగకుండా.. ప్రో బీజేపీ మీడియా ఎందుకు హైలెట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం. వాస్తవానికి టీడీపీతో పొత్తు విషయంలో లక్ష్మణ్ చాలా సానుకూలంగా ఉన్నారని.. ఆయన పాజిటివ్ రిపోర్టులు ఢిల్లీకి ఇచ్చారని చెబుతున్నారు.
అయితే రాజకీయ పార్టీలు ఏవీ పొత్తుల విషయంలో పూర్తి స్థాయిలో చర్చలు పూర్తయ్యే వరకూ బయటకు వెల్లడించవు. ప్రజల మూడ్ తెలుసుకోవడానికి కొన్ని లీకులు ఇస్తాయి. ఇప్పుడు టీడీపీ, బీజేపీ అదే టెస్టింగ్ చేస్తున్నాయని అనుకోవచ్చు. కారణం ఏదైనా కానీ.. టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి మారిపోయిందని.. తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్‌ను ప్లస్‌గా మార్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.