అమాంతం స్టార్ డమ్ వచ్చేసినవాళ్లు ఎగిరెగిరి పడ్డారంటే ఓ అర్థం ఉంది. ఒక్కో అడుగూ వేస్తూ, డక్కా ముక్కీలు తింటూ, మెల్లమెల్లగా స్థిరపడిన వాళ్లు ఒదిగే ఉంటారు. ఎందుకంటే సడన్ గా కింద పడితే, పరిస్థితి ఏమిటన్నది వాళ్లకే బాగా తెలుసు. అయితే ఓ హీరో విషయంలో ఈ సీన్ రివర్స్ అయ్యింది. చిన్న చిన్న వేషాలు వేస్తూ, మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, ఆ తరవాత హీరో ఫ్రెండ్ స్థాయికి చేరి, ఓ శుభముహూర్తాన హీరో అయిపోయి, ఒకట్రెండు హిట్లు సంపాదించుకొన్నాడాయన. ఇప్పుడు పరిస్థితి బాగుంది. చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. ఓ స్టార్ హీరోయిన్ సినిమాలో ఆయనే హీరో. ఓ బడా హీరో సినిమాలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో రెండు మూడేళ్ల పాటు కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేదు. అలాంటి ఆ హీరో ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.
ఈమధ్య ఓ అగ్ర హీరోయిన్ తో జోడీ కట్టాడు. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పుడు ఆ సినిమా చూపిస్తూ.. ‘నాకు స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లే కావాలి’ అని షరతు పెడుతున్నాడు. తనకు కాస్త క్లోజ్ గా ఉన్న హీరోయిన్లని సినిమాల్లో తీసుకోవాలని నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నాడని తెలుస్తోంది. పైగా ప్రమోషన్లు భారీగా చేయాలని, ప్రమోషన్ల బడ్జెట్ కూడా తానే వేసి ఇస్తున్నాడని, పబ్లిసిటీకి ఆ స్థాయిలో ఖర్చు పెట్టకపోతే, తాను ప్రమోషన్లకు రానని నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడట. దాంతో నిర్మాతలు తలలు పట్టుకొంటున్నారు. ‘ఈ హీరోని ఎరక్కపోయిన తీసుకొన్నాం…’ అని ఫీలవుతున్నార్ట. ఓ సినిమా తీశాక.. దాని స్థాయిని, మార్కెట్ ని బట్టి ప్రమోషన్లు చేసుకుంటారు. హీరో పక్కన ఎవరైతే బాగుంటారన్న విషయంలో దర్శకుడికి ఓ అభిరుచి ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి, నా మాటే నెగ్గాలని పట్టుపట్టుకొని కూర్చోవడం ఏమాత్రం హర్షణీయం కాదు. ఓ వైపు హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలని, నిర్మాతల్ని బతికించాలని పోరాటం చేస్తుంటే మరోవైపు ఇలా గొంతెమ్మ కోర్కెలు కోరుతూ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టే హీరోలు తయారవ్వడం దారుణమైన విషయమే.