వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపుల పాయలో వైఎస్ కుటుంబం అంతా దాదాపుగా ఒక్కటిగా కనిపించింది. వైఎస్ సునీత మినహా మిగిలిన వారు అందరూ కలిసే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. సీఎం జగన్‌తో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పక్క పక్కనే కూర్చున్నారు. మాట్లాడుకున్నారు. అయితే ఓ సందర్భంలో పక్కన వ్యక్తి ఇచ్చిన పేపర్‌ను షర్మిల జగన్‌కు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అది షర్మిల ఇస్తున్నారని అనుకున్నారేమో కానీ.. జగన్ తీుకోలేదు . వద్దని చెప్పేశారు.
దాంతో షర్మిల ఆ పేపర్‌ను వెనక్కి ఇచ్చేశారు. ఇదొక్కటి మినహా మిగతా అంతా కుటుంబంలో ఏ వివాదాలు లేనట్లుగా కార్యక్రమం జరిగిపోయింది. ప్రతీ సారి వైఎస్ జయంతి లేదా వర్థంతి సందర్భంగా వేర్వేరుగా నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. కొన్నిసందర్భాల్లో ఒకే సారి నివాళులు అర్పించినా మాట్లాడుకోవడం లేదు. కుటుంబంలో వివాదాలు పెరిగిపోయాయని ఈ కారణంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా కూడా జగన్, షర్మిల కలుసుకోవడం లేదు.
సోషల్ మీడియా ద్వారా కూడా జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ పరిణామాలన్నీ ఇతర పార్టీల నేతలకు అస్త్రంగా మారాయి. అదే సమయంలో పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేయడంతో .. ఈ చర్చలు మరింత పెరిగాయి. వాటికి చెక్ పెట్టేందుకు వైఎస్ వర్థంతి సందర్భంగా నివాళి కార్యక్రమం ఉపయోగపడినట్లుగా భావిస్తున్నారు.