టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతున్నారు. శనివారం కేబినెట్‌తో పాటు టీఆర్ఎస్ఎల్పీ భేటీ నిర్వహిస్తున్న ఆయన రెండు రోజుల గ్యాప్‌తో అసెంబ్లీని కూడా సమావేశపర్చాలని నిర్ణయించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఆరో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతున్న సందర్బంలో.. ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
సీఎం కేసీఆర్ కార్యాచరణ అంతా మునుగోడు కోసమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్ళే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు డిఫరెంట్ గా ఉండటంతో ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చిస్తారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా ఉండటంతో జరుగుతున్న చర్చలకు బలం చేకూరుతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేయాలనే టీఆర్ఎస్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారేమోనన్న విధంగా సమావేశాలు జరపడం సహజమేనని.. సంచలనాత్మక పరిణామాలు ఏమీ ఉండవని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయం ఒక్క సారిగా మారిపోతుంది. కేసీఆర్ నిర్ణయాలపై అవగాహన ఉన్నవారు మాత్రం.. ఈ విషయాన్ని కాదనలేమని అంటున్నారు.