ఇది వరకు బాలీవుడ్ తారలు తెలుగు చిత్రసీమను అస్సలు పట్టించుకొనేవారు కాదు. ఇక్కడ సినిమా చేయాలంటే వంద లెక్కలు వేసుకొని `నో` చెప్పేవారు. బాలీవుడ్ ని మించినదేదీ లేదని వాళ్ల గట్టి నమ్మకం. తెలుగులో సినిమా చేసినా ప్రమోషన్లకు వచ్చేవారు కాదు. వచ్చినా తెలుగు మాట్లాడే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు మారాయి. తెలుగు చిత్రసీమ బాలీవుడ్ ని తలదన్నే స్థాయికి చేరుకొంది. తెలుగు నుంచి వచ్చేవే సిసలైన `పాన్ ఇండియా సినిమాలు` అని నమ్మే స్థాయికి జనాలు వెళ్లారు. దాంతో బాలీవుడ్ కూడా తెలుగు చిత్రసీమ ఆకర్షణలో పడిపోయింది. తమ సినిమాల్ని తెలుగులో ప్రచారం చేసుకోవడానికి నానా తిప్పలూ పడుతున్నారు. వాళ్ల టీమ్ మొత్తం తెలుగు రాష్ట్రాల చుట్టూ పచార్లు కొడుతున్నారు. బ్రహ్మాస్త్రకు అదే జరుగుతోంది. ఇదో బాలీవుడ్ సినిమా. కాకపోతే.. తెలుగు సినిమానే అనే కవరింగు ఇవ్వడానికి బ్రహ్మాస్త టీమ్ చాలా కష్టాలు పడుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు. `బ్రహ్మాస్త` టీమ్ తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ వచ్చాడంటే ఎవరి స్పీచులూ కంటికి కనిపించవు, వినిపించవు. కానీ అలాంటి చోట కూడా అలియాభట్ స్పీచ్ తో అదరగొట్టింది. తెలుగులో ఓ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే..“ అనే పాటని రాగయుక్తంగా పాడి ఆకట్టుకొంది అలియా. `ఆర్.ఆర్.ఆర్` సమయంలోనూ తెలుగులో మాట్లాడడానికి తన వంతు ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా పాటే పాడేసింది. అలియా ఈ పాట పాడిన విధానానికి అంతా ముగ్థులైపోతున్నారు. `ఆర్.ఆర్.ఆర్` తరవాత తెలుగులో అలియా మరో సినిమా చేయడానికి నిరాకరిస్తోందని వార్తలొచ్చాయి. అయితే.. అలియా స్పీడు చూస్తుంటే తెలుగు సినిమాలపై ఈసారి మరింత గట్టిగా గురి పెట్టేసినట్టు కనిపిస్తోంది.