సినిమాలో విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని ఊరకే అనలేదు పెద్దలు. `ఫస్ట్ డే – ఫస్ట్ షో` సినిమా విషయంలో ఇదే అక్షరాలా నిజం అయ్యింది. నిజానికి తెరపై కనిపించే హీరో, హీరోయిన్ల మొహాలు చూస్తే – ఈ సినిమాని ఎవరూ పట్టించుకొనేవారు కాదు. కానీ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించింది జాతిరత్నాల దర్శకుడు అనుదీప్. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే. పైగా… తెలుగు చిత్రసీమకు కళాఖండాల్లాంటి సినిమాలు అందించిన పూర్ణోదయ ఫిలిమ్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో `ఫస్ట్ డే – ఫస్ట్ షో` పై ఆసక్తి పెరిగింది. పవన్ కల్యాణ్ రిఫరెన్సులు ఉన్న సినిమా అవ్వడం, చిరంజీవిని ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి తీసుకొచ్చి హడావుడి చేయడంతో పబ్లిసిటీ వ్యవహారాలు మామూలుగా సాగలేదు.
పైగా అనుదీప్ ఈ సినిమా కోసం చేసిన వీడియో ఇంటర్వ్యూలు బాగా వైరల్ అయ్యాయి. ఇంటర్వ్యూలోనే ఇంత ఫన్ ఉంటే, సినిమాలో ఇంకెంత ఉందో అని భ్రమ పడ్డారు జనాలు. తీరా చూస్తే… ఫస్ట్ డే, ఫస్ట్ షోకే ఈ సినిమా డిజాస్టర్ అనే టాక్ బయటకు వచ్చేసింది. ఏమాత్రం విషయం లేని సినిమా ఇది. అర్థం పర్థం లేని సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు. కామెడీ సీన్లు మరింత పేలవంగా తీర్చిదిద్దాడు. పవన్ కల్యాణ్ రిఫరెన్సులు వందున్నాయి. కానీ.. అవి పవన్ ఫ్యాన్స్‌కి కూడా చిరాకు తెప్పిస్తాయి. హీరో, హీరోయిన్ల మొహాలు కూడా తేలిపోయాయి. మొత్తంగాచూస్తే.. ఈమధ్య కాలంలో ఇంత పబ్లిసిటీ చేసి – తొలి షోకే బొక్క బోర్లా పడిన చిన్న సినిమా ఇదేనేమో..? కాకపోతే.. ఈసినిమాతో చేసిన ప్రమోషన్లకు, ఇచ్చిన బిల్డప్పులకూ బిజినెస్ బాగానే చేసుకోగలిగారు. నిర్మాతలకేం నష్టం లేదు. కానీ అనుదీప్‌కే ఇది మచ్చ. ఎందుకంటే.. జాతిరత్నాలు తరవాత అనుదీప్ పై నమ్మకాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ తో `ప్రిన్స్` సినిమా చేస్తున్నాడు. ఈ ఫ్లాప్ ప్రభావం `ప్రిన్స్`పై పడకుండా చూసుకోవాలి.