సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైన సమావేశానికి గైర్హాజర్ అవుతున్నారు. వైఎస్ వర్థంతి కార్యక్రమాలు ముగిసినప్పటికీ ఆయన పులివెందులలోనే ఉన్నారు. కానీ తిరువనంతపురంలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి జగన్ వెళ్లలేదు. ఈ సమావేశం .. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతోంది. గత సమావేశం తిరుపతిలో జరిగింది. అప్పుడు సీఎం జగన్ హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అమిత్ షాతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు అవకాశం లభించింది. అయితే తిరువనంతపురం మీటింగ్‌కు మాత్రం జగన్ హాజరు కాలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ హాజరు కాలేదు.
ఈ సమావేశం ఎజెండా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవడం.తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల విద్యుత్ బకాయిల పంచాయతీ నడుస్తోంది. తెలంగాణ చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. కానీ తెలంగాణ చెల్లించేది లేదంటోంది. ఈ విషయంలో తెలంగాణపై ఒత్తిడి చేయడానకి ఈ మీటింగ్ బాగా ఉపయోగపడేది. అయితే జగన్ కాకుండా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పంపారు. దీంతో ఈ మీటింగ్‌పై ఏపీకి సీరియస్ నెస్ లేకుండా పోయినట్లయింది.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో ఎక్కువగా మోదీని ఇతర మంత్రుల్ని కలుస్తున్నారు కానీ… అమిత్ షాను కలవడం లేదు. షా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదో.. లేకపోతే జగనే ఆసక్తి చూపించడం లేదో స్పష్టత లేదు. అమిత్ షాతో మీటింగ్‌కు జగన్ ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడంతో… ఆయనను కలవడం జగన్‌కు ఇష్టం లేదని అనుకోవాలని వైసీపీ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.