”మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు” అని ఓ సామెత. ఇప్పుడు బాలీవుడ్ ది ఇదే పరిస్థితి. వరుస ఫ్లాపులు బాలీవుడ్ ని ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తయితే, సౌత్ సినిమాలు వందల, వేల కోట్లు సాధించేయడం వాళ్లకు మింగుడు పడడం లేదు. ఆఖరికి ‘కార్తికేయ 2’ కూడా నార్త్ లో ఇరగడాడేసింది. నిఖిల్ ఎవరో తెలీదు. తన సినిమాలెప్పుడూ వాళ్లు చూసి ఉండరు. కానీ.. `కార్తికేయ 2`ని సైతం ఆదరించారు. అదే సమయంలో అక్కడ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ చేతులు ఎత్తేశారు. బడా సినిమాలు బోల్తా కొట్టాయి. కొన్నింటికైతే అస్సలు ఓపెనింగ్స్ కూడా రాలేదు. బాలీవుడ్ ఉనికిని, ఆధిపత్యాన్ని ప్రశ్నార్థకం చేసే ఫ్లాపులు తగిలాయి ఈమధ్య. ఇప్పుడు వాళ్ల దృష్టి ‘బ్రహ్మాస్త్ర’పై పడింది.
ఈనెల 9న ఈ సినిమా విడుదల అవుతోంది. దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రాల్లో ఇదొకటి. ఏకంగా మూడు భాగాలుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అమితాబ్, రణబీర్, అలియా, నాగార్జున.. ఇలా స్టార్లకు కొదవ లేని సినిమా ఇది. దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్లని చేపట్టారు. అడ్వాన్సు బుకింగులు మెల్లమెల్లగా ఊపందుకొంటున్నాయి. కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్, పుష్ఫ రికార్డుల్ని బ్రేక్ చేసే శక్తి `బ్రహ్మాస్త`కు ఉందని బాలీవుడ్ నమ్ముతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. ఖర్చు తిరిగి రాబట్టుకొని, కొత్త రికార్డులు సృష్టించాలంటే కనీవినీ ఎరుగని హిట్ కొట్టాలి. అలా జరిగితే.. బాలీవుడ్ కాస్త తేరుకుంటుంది. లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్, షంషేరా లాంటి సినిమాలకు ఎదురైన అనుభాలు ఈ సినిమాకీ ఎదురైతే మాత్రం.. ఇక మీదట `భారీ బడ్జెట్ సినిమా` అనే పేరు ఎత్తడానికి కూడా బాలీవుడ్ భయపడడం ఖాయం. బాలీవుడ్ లో బడా సినిమాల భవిష్యత్తుని `బ్రహ్మాస్త్ర` డిసైడ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.