కేంద్ర హోంమంత్రి పిలిచారనో.. మరో కారణమో కానీ జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే అక్కడ రాజకీయ చర్చలు జరిగాయో లేదో స్పష్టత లేదు కానీ బీజేపీ నేతలు మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌ను తగ్గిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనను ప్రచారానికి వాడుకుంటామని కబుర్లు చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో అడుగు ముందుకేసి.. ఎన్టీఆర్‌కు ఎక్కడ ప్రజాదరణ ఉంటే అక్కడ ఉపయోగించుకుంటామని ప్రకటించేశారు.
ఎన్టీఆర్ విలువను తగ్గించేలా బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారున్న అభిప్రాయం వినిపిస్తోంది. జూ.ఎన్టీఆర్ బీజేపీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన రాజకీయ వివాదాలు రాకుండా స్పందిస్తున్నారు. కానీ తప్పని సరి పరిస్థితుల్లో అమిత్ షాను కలవాల్సి వచ్చింది. అలా కలిసినందున ఆయన బీజేపీలో చేరిపోయారని .. ప్రచారం చేయించుకుంటామని.. రకరకాలుగా స్పందిస్తూ.. ఎన్టీఆర్‌ను అవమానిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నేతలు బీజేపీ వ్యవహరిస్తున్న ఆయన అభిమానులను కూడా అసహనానికి గురి చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా కించ పరుస్తున్నారని దీని వెనుక పెద్ద వ్యూహం ఉందని భావిస్తున్నారు. బీజేపీ నేతలపై రాజకీయంగా స్పందిస్తే అది మరింత వివాదం అవుతుంది తప్ప ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని.. సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో సమాధానం చెబుతామంటున్నారు.