ఆంధ్రప్రదేశ్ పోలీసుల చెప్పే కథలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా కూడా జరుగుతుందా అని అసలు ఏమీ తెలియని వాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా కథలు ఉంటాయి. ఇలాంటివి చెప్పడానికి నేర పరిశోధనల్లో ఢక్కా మొక్కీలు తిన్న ఐపీఎస్లు సైతం ఎందుకు సంకోచించడం లేదో ఎవరికీ అర్థం కాదు. తాజాగా విజయవాడ సీపీ క్రాంతి రాణా.. టీడీపీ కార్పొరేటర్ భర్త అయిన చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి గురించి చెప్పిన కథ కూడా అంతే పేలవంగా.. కామెడీగా ఉంది.
క్షణికావేశలో జరిగిన దాడి అని.. కేవలం చేతుల్తో కొట్టడం వల్లనే ఓ కన్ను పోయేలా దెబ్బతగిలిందని సీపీ క్రాంతి రాణా టాటా చెప్పుకొచ్చారు. దీనికి వైద్యులు ఇచ్చిన నివేదిక కూడా ఉందని చెప్పుకొచ్చారు. చేత్తో కొడితే కనుగుడ్డు పగిలిపోయి రక్తం రావడం వంటి సీన్లు సినిమాల్లో చూసి ఉంటారు కానీ.. నిజంగా అది సాధ్యమని ఎవరూ అనుకోరు. చేతులతో ఎన్ని సార్లు కొట్టినా గాయాలు అవుతాయని కూడా ఎవరూ అనుకోరు. బలమైన ఆయుధంతో కొట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా .. పోలీసులు మాత్రం ఆయుధాలేమీ వాడలేదని చెబుతున్నారు.
ఎందుకు వాగ్వాదం జరిగిందో సీపీ చెప్పలేదు కానీ.. అది క్షణికావేశంలో జరిగిన దాడి అని కొట్టిన వాళ్లని సమర్థించేలా మాట్లాడారు. నిజానికి చెన్నుపాటి గాంధీపై దాడికి.. రెక్కీ కూడా నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన సీసీ ఫుటేజీలూ ఉన్నాయని చెబుతున్నారు. కానీ సీపీ మాత్రం వైసీపీ నేతలను వీలైనంత వేగంగా బయటపడేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి కుట్ర పూరితంగా .. ఉద్దేశపూర్వకంగా టీడీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి చేశారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో రెండు సార్లు టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేయలేదు. పట్టపగలు నేరాలు..ఘోరాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా దారుణమైన ఘటనలు జరిగితే.. అవన్నీ సర్వ సాధారణం అన్నట్లుగా డీజీపీ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఇలాంటి పోలీసింగ్ ఉంటే.. నేరస్తులకు. దాడులు చేసే వారికి భయం ఎక్కడ ఉంటుంది?