కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయన ఒక్క అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్.. ధర్డ్ ఫ్రంట్.. బీఆర్ఎస్ అంటూ ఆయన చేస్తున్న రాజకీయ ప్రయోగాలు… ప్రారంభదశలోనే తేలిపోతున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లక ముందే కేసీఆర్ చాలా రాష్ట్రాల్లో తిరిగారు. కాంగ్రెస్ మిత్రపక్షాలనే అత్యధికంగా కలవడం వల్ల బీజేపీ కోసం ఆయన మూడో ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఎక్కువ వినిపించింది. దీంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. కేంద్రాన్ని శాసించే రీతిలో సీట్లు సాధించి ఇతర ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి కింగ్ మేకర్ అవ్వాలనుకున్నారు. అందుకే నవీన్ పట్నాయక్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ వటి రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ ఎన్నికలకు ముందు కూటమి సాధ్యం కాలేదు. ఎన్నికల తర్వాత ఆ అవసరం రాలేదు. రెండు సార్లు ప్రయత్నాలు విఫలమైనా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు.
ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రాంతీయ పార్టీలు కుంచించుకుపోయాయి. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి .. సిద్ధంగా లేవు.. ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందామన్నట్లుగా పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ఎవరూ పెద్దగా సిద్ధంగా లేరు.చివరికి తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ లాంటి వాళ్లు కూడా సుముఖంగా లేరు. కూటములు కట్టడం సాధ్యం కాదని సొంత జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారు. రైతులదర్నీ ఏకతాటిపైకి తీసుకు వస్తే.. తెలంగాణ ఉద్యమం తరహాలో అందర్నీ ఏకం చేస్తే.. అనుకున్నది సాధించినట్లవుతుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీపై దృష్టి పెట్టారు.