ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీలో చేరడానికి తాడేపల్లికి వెళ్లారోచ్ అని.. ఓ యూట్యూబ్ చానల్ బ్రేకింగ్ వేసేసింది. ఆ సమయంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఓ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ విషయం ఎక్కువ మందికి తెలియదు. కానీ ఈ న్యూస్‌ను వేసిన యూట్యూబ్ చానల్.. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు ఇచ్చి మరీ వైరల్ చేసింది. వైసీపీ నేతలు దాని కోసమే రెడీగా ఉన్నారు. ఇక ఇటీవల నియమితులైన జిల్లా కన్వీనర్లు… కో కన్వీనర్లు ప్రత్తిపాటి వైసీపీలో చేరిపోయాడని చెప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు.
ప్రచారం చేసినంత సేపు చేసుకున్నారు కానీ చివరికి ప్రత్తిపాటి గాలి తీసేశారు. దాంతో వైసీపీతో పాటు ఆ చానల్ పరువు కూడా పోయినట్లయింది. తమ సర్వేల్లో తేడా వచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీలో ఉన్న బలమైన నాయకుల్ని లాక్కునేందుకు ఇలా వైసీపీ నేతలు.. ఐ ప్యాక్ టీంతో కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి చాలా మంది సీనియర్లను చంద్రబాబు ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేయడం .. వారికి కూడా కాస్త ప్లస్ అయ్యేలా ఉంది.
గతంలో కళా వెంకటరావు గురించి అలాగే రాశారు. నిన్న ప్రత్తిపాటి పుల్లావు.. రేపు మరొకరు. ఎవరైనా వైసీపీలో చేరుతారో లేదో తెలియదు కానీ.. వైసీపీ నేతలు మాత్రం.. . మా పార్టీలోకి వచ్చేస్తారంటూ ప్రచారం చేయించేసుకుంటున్నారు. నిజంగానే ఆ సీనియర్లు వచ్చి చేరినా టీడీపీకి పోయేదేమీ ఉండదు.. పైగా వారిని చేర్చుకుని వైసీపీనే సర్దుబాటు చేసుకోలేక తంటాలు పడాలని టీడీపీ నేతలంటున్నారు. అయితే ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్ చానళ్లను వదిలేసి లేదని.. ఒక్క సారి సీన్ మారగానే సినిమా చూపిస్తామని టీడీపీ నేతలంటున్నారు.