ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా మారుతి ఈ స్క్రిప్టుతోనే కుస్తీ పడుతున్నాడు. ఎట్టకేలకు స్క్రిప్టు ఫైనల్ స్టేజీకి చేరుకొంది. స్క్రిప్టు పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని టాక్. ఇప్పుడు తన దృష్టి టైటిల్ పై పడింది. `రాజా డీలెక్స్` అనే పేరు బయటకు వచ్చినా… అది టైటిల్ కాదు. ఇంకో ఆసక్తికరమైన టైటిల్ కోసం మారుతి అన్వేషిస్తున్నాడు. నాలుగైదు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. టైటిల్ యూనివర్సల్ గా ఉండాలి. అన్నిభాషల్లోనూ ఒకే టైటిల్ తో సినిమా విడుదల చేయాలి. అందుకే అందరికీ అర్థమయ్యే టైటిల్ కోసం చూస్తున్నాడు మారుతి. ఇదో థియేటర్ నేపథ్యంలో సాగే కథ. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బొమన్ ఇరానీని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకొన్నట్టు సమాచారం. తాతల నాటి ఆస్తి కోసం హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. నవంబరు నుంచి ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్లు కేటాయించాడని తెలుస్తోంది. ఈలోగా కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేయనున్నాడు మారుతి.